‘ఆ ఫ్యామిలీలో అందరివి నియంతృత్వ పోకడలే’

BJP leader Sambit Patra Slams To Rahul Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికార దాహంతో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ అఖిల భారత అధికార ప్రతినిధి సంబీత్‌ పాత్ర విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో ప్రజల సొమ్ము దోచుకున్నారని ధ్వజమెత్తారు. మీ కుటుంబం, ప్రత్యేకంగా మీ నానమ్మ ఏమి చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. 43 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారని మండిపడ్డారు. అంతేకాక ఆర్టికల్‌ 21ని  సస్సెండ్‌ చేసిన విషయాన్ని సంబీత్‌ గుర్తు చేశారు. 

‘జూన్‌ 25న,1975లో దివంగత నేత ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. అదే బాటలో రాహుల్‌ వెళ్తున్నారు. నిరంకుశ దారిలో పోతున్నాడు. ప్రతి ఓటమి తర్వాత ఈవీఎం, ఈసీఐని విమర్శిస్తున్నారు. సీజేఐపై అభిశంసన పెట్టాలని చూశాడు. సంఘ కార్యకర్తలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. జైలుకి వెళ్ళారు. భారత్‌ను పాలించడానికి మాకే హక్కు ఉందని ఆ కుటుంబం అనుకుంటుంది. దివంగత నేత నెహ్రూ కారణంగానే ఇంకా కాశ్మీర్‌ సమస్య ఉంది. ఆ కుటుంబంలో అందిరివి నియంతృత్వ పోకడలే. 

అప్రకటిత ఆదాయంపై రాబర్ట్ వాద్రా రూ. 85 కోట్లు ఐటీ కట్టారని వార్తలు వచ్చాయి. ఇన్ని రోజులు కట్టక పోవడం నియంతృత్వమే. వారసత్వ రాజకీయలు చేస్తున్న వారు.. ప్రజాస్వామ్య వాదులు కారు. న్యూ జిన్నా అసదుద్దీన్. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలను విభజన చేసే విధంగా ఉన్నాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనకళ్యాణ్‌ నీతి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రణనీతితో ఒక్కో రాష్ట్రములో అధికారంలోకి వస్తున్నాం. పరివార్‌ వాద, జాతి వాద, బుజ్జగింపు రాజకీయాలకి వ్యతిరేకం. తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వానికి ఓటమి తప్పదు. మేం కూడా తెలంగాణలో పుంజుకుంటున్నాం. ముందుస్తు ఎన్నికలు అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే వాటిపై స్పందించాల్సిన అవసరం లేదని’ బీజేపీ నేత సంబీత్‌ పాత్ర స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top