కాంగ్రెస్‌ జాబితా..చంద్రబాబు ముద్ర

BJP Leader Krishna Sagar Rao Slams Congress And TDP In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ జాబితా చూస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు  నాయుడి ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ఇపుడు కాంగ్రెస్‌ జాబితా పరిశీలిస్తే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార​ రెడ్డి పట్టుకోల్పోయినట్లు తెలుస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన 65 అభ్యర్థులు ప్రజలతో ఉన్న నేతలు కాదని అన్నారు.

ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కడా గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు.  మహా కూటమి ఓనర్‌ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని ఎద్దేవా చేశారు. ఈ తెలంగాణ వ్యతిరేక కూటమికి మెజారిటీ సీట్లు వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారో కాంగ్రెస్‌ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. మెజార్టీ సీట్లు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి, లోకేష్‌ హోంమంత్రి అవుతారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని చంద్రబాబు కబ్జా చేశారని విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్‌ పార్టీని నేతలు చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు.

కర్ణాటకలో కుమార స్వామి మాదిరిగా టీడీపీకి తక్కువ సీట్లు వచ్చినా చంద్రబాబు సీఎం పదవి చేపడతారని, కర్ణాటక మోడల్‌ రాజకీయాన్ని కాంగ్రెస్‌ తెలంగాణలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రంలో అవినీతి రహిత పాలన కొనసాగిస్తున్న బీజేపీకి ఓటేస్తారా లేక అన్నిరంగాల్లో విఫలమైన టీఆర్‌ఎస్‌కు ఓటేస్తారా లేక తెలంగాణ ఆత్మగౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టిన కాంగ్రెస్‌కు ఓటేస్తారా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు.  మిషన్‌ భగీరథతో నీళ్లు రాకపోతే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడెందుకు ఓట్లు అడుగుతున్నారని సూటిగా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top