
సాక్షి,న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో సీఎంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేరును పార్టీ అగ్ర నాయకత్వం పరిశీలిస్తోంది. పార్టీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమి పాలవడంతో నడ్డా పేరు తెరపైకి వచ్చింది. సీఎం అభ్యర్థి రేసులో గతంలోనూ ధుమాల్‌తో నడ్డా పోటీ పడినప్పటికీ గతంలో రెండు సార్లు సీఎంగా వ్యవహరించడంతో పాటు వీరభద్రసింగ్‌కు దీటైన పోటీ ఇవ్వగలరనే అంచనాతో ధుమాల్‌వైపే బీజేపీ మొగ్గుచూపింది.
ధుమాల్ ఓటమితో తాజాగా జేపీ నడ్డా అభ్యర్థిత్వం వైపు ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా ఆసక్తి చూపుతున్నారు. అగ్రనేతలతో సాన్నిహిత్యం కూడా జేపీ నడ్డాకు కలిసివస్తుందని భావిస్తున్నారు.
68 స్ధానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 40 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 21 స్ధానాలతో ప్రతిపక్ష స్ధానానికి పరిమితం కానుంది. ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.