కన్నారంపై కమలనాథుల గురి

Bjp Concentrating On Kannaram - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మోదీ మంత్రంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కమలనాథులు కరీంనగర్‌ స్థానంపై కూడా కన్నేశారు. గతంలో రెండుసార్లు విజయం సాధించిన కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో ఈసారి గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని ఆ పార్టీ భావిస్తోంది. హిందుత్వ ఎజెండాతో గత కొన్నేళ్లుగా కరీంనగర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న బండి సంజయ్‌కుమార్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌తో నువ్వా, నేనా అన్నట్టుగా సాగిన పోరులో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో రెండోస్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లే ప్రాతిపదికగా లోక్‌సభ అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీ కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌ను పోటీ చేయిస్తోంది. వారం రోజులుగా లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. యువత నుంచి ఆశించిన స్పందన లభిస్తుండడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కరీంనగర్‌లో ప్రచార సభలో పాల్గొనేందుకు వస్తుండడం ఆ పార్టీకి కొత్త ఊపును తీసుకొస్తుందని భావిస్తున్నారు. మైనార్టీ వర్గాలు పెద్దసంఖ్యలో నివసించే కరీంనగర్‌లో హిందుత్వ ఎజెండాతో పాటు కేంద్రం ద్వారా విడుదలవుతున్న నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపైనే అమిత్‌షా ప్రసంగం సాగుతుందని సమాచారం. 

రెండుసార్లు గెలిచిన బీజేపీ
కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీకి రెండుసార్లు విజయం సాధించిన చరిత్ర ఉంది. 1998 పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఒంటరిగా కరీంనగర్‌ నుంచి పోటీ చేసిన చెన్నమనేని విద్యాసాగర్‌ రావు 95వేల మెజార్టీతో టీడీపీ ప్రత్యర్థి రమణపై విజయం సాధించారు. ఇక 1999 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన విద్యాసాగర్‌రావు సుమారు 20వేల ఓట్లతో చల్మెడ ఆనందరావుపై గెలుపొందారు. అలాగే, 2004లో కేసీఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఆయన చేతిలో పరాజయం పాలైన విద్యాసాగర్‌ రావు తిరిగి విజయం సాధించలేదు. తెలంగాణ ఉద్యమం తర్వాత పరిణామాల నేపథ్యంలో మూడో స్థానానికి పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌ ఈసారి పెరుగుతుందని, పూర్వ వైభవం సాధించవచ్చని భావిస్తోంది. కరీంనగర్‌ మినహా మిగతా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాయకత్వ లోపంతో బాధపడుతున్న బీజేపీ పూర్తిగా యువతనే నమ్ముకుని ప్రచారం సాగిస్తోంది. అమిత్‌షా రాకతో పార్టీ కేడర్‌లో కొత్త ఊపు రావడంతో పాటు పార్టీపై ప్రజల్లో కూడా ఆసక్తి పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అమిత్‌షా పర్యటన తర్వాత ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని గ్రామాల్లో సైతం బలం పుంజుకుంటామని సంజయ్‌ ధీమాతో ఉన్నారు. 

సభకు ఏర్పాట్లు పూర్తి
బీజేపీ చీఫ్‌ అమిత్‌షా పాల్గొనే బహిరంగసభ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో జరగనుంది. ఉదయం 9 గంటలకే అమిత్‌షా వస్తారని ప్రచారం చేస్తున్నప్పటికీ, 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ మేరకు వేదికతో పాటు ఇతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు హాజరైన వారికి ఎండ వేడి తగలకుండా విశాలమైన స్థలంలో పైకప్పుతో కూడిన షెడ్డు తరహా నిర్మాణం పూర్తి చేశారు. హైసెక్యూరిటీ రక్షణలో ఉండే అమిత్‌షా సభ కోసం ముందస్తుగానే వీఐపీలకు, మీడియాకు పాస్‌లు జారీ చేశారు. అలాగే, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పార్టీ అభ్యర్థి బండి సంజయ్‌తో పాటు పలువురు రాష్ట్ర నాయకులు బుధవారం మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

అమిత్‌ షా సభను విజయవంతం చేయండి
కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాల అమిత్‌షా విజయ సంకల్ప సభ ను జయప్రదం చేయాలని బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఎస్సారార్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర నాయకులు పరిశీలించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, కరీంనగర్‌ లోక్‌సభ ఇంచార్జీ కామర్స్‌ బాల సుబ్రణ్యం, మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎస్సారార్‌కళాశాల మైదానంలో ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని అన్నారు. విజయ సంకల్ప సభ విజయవంతం  చేసేందుకు నరేంద్రమోడీ అభిమానులు బీజేపీ నాయకులు కార్యకర్తలు బూత్‌ కమిటీ సభ్యులు అదిక సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని కోరారు. వివిధ వ్యాపార వాణిజ్య, కార్షక కార్మిక యువతరం మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున్న హాజరుకావాలని కోరారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top