కాయ్‌.. రాజా కాయ్‌!

Bettings Rise in telangana After Exit Polls - Sakshi

ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడటంతో జోరుగా పందేలు ∙తెలంగాణలో ఆ ఆరు స్థానాలపైనే ఉత్కంఠ

బెట్టింగ్‌లపై కానరాని లగడపాటి ప్రభావం

ఈసారి టీఆర్‌ఎస్, వైసీపీలే హాట్‌ ఫేవరెట్లు..  

సాక్షి, హైదరాబాద్‌: ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడేసరికి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. మొత్తం ఏడు దశల్లో సుదీర్ఘంగా జరిగిన ఎన్నికలు కావడంతో ఇంతకాలం పందెం రాయుళ్లు స్తబ్దుగా ఉన్నారు. కానీ, ఆదివారం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడటంతో పందేలు జోరందుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు పలు తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ జోరుగా పందేలు సాగుతున్నాయి. పలు స్థానాలపై ఇప్పటికే పార్టీల బలాలవారీగా స్పష్టత వచ్చింది. దీంతో ఇక మెజారిటీ ఎంత వస్తుంది.. అన్న అంశాలపై బెట్టింగులు ఊపందుకున్నాయి.

ఆరు స్థానాలపై ఉత్కంఠ..
ఇక తెలంగాణలో ఆరు స్థానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌కు అత్యధిక స్థానాలు వస్తా యని ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. ప్రతిపక్షాలకు ఒక ట్రెండు సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యం లో భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, మల్కాజిగిరి స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మూడు పార్టీలు నువ్వానేనా అన్న తరహాలో సర్వశక్తులూ ఒడ్డాయి. ఆయాస్థానాల్లో అన్ని పార్టీలు విజయంపై ధీమాగా ఉండటం విశేషం. దీంతో ఈ స్థానాలపై పందేలు కాసేందుకు పందెంరాయుళ్లు అధికంగా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? ఎంత మెజారిటీ వస్తుంది? అన్న విషయాలపై బెట్టింగులు సాగుతున్నాయి. రూ.1000 నుంచి రూ.లక్షల్లో ఈ బెట్టింగులు సాగడం విశేషం.

ప్రభావం చూపని లగడపాటి..
గత తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలకు ముందు ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌ కాంగ్రెస్‌–తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని తన సర్వేను ప్రకటించాడు. అదేసమయంలో జాతీయ సర్వేలన్నీ రాజగోపాల్‌ సర్వేకు విరుద్ధంగా ఉన్నా సరే.. మెజారిటీ ప్రజలు, పందెం రాయుళ్లు రాజగోపాల్‌ సర్వేకే మొగ్గుచూపారు. అదే నమ్మకంతో కోట్ల రూపాయల్లో కూటమి గెలుస్తుందంటూ రెండు రాష్ట్రాల ప్రజలు జోరుగా పందేలు కాశారు. అయితే టీఆర్‌ఎస్‌ 88 స్థానాలు గెలవడం, కాంగ్రెస్‌ కూటమి కేవలం 21 స్థానాలకు పరిమితమవడంతో కథ అడ్డం తిరిగింది. కూటమి గెలుస్తుందంటూ రూ.వందల కోట్లలో పందేలు కాసిన వారు ఘోరంగా ఓడిపోయి.. మొత్తం డబ్బును పోగొట్టుకున్నారు. ఈసారి కూడా అదేరీతిలో లగడపాటి సర్వే ఉండటంతో బెట్టింగుబాబులు లగడపాటి సర్వేను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.

టీఆర్‌ఎస్, వైసీపీ వైపే..
అన్ని సర్వేలు తెలంగాణలో టీఆర్‌ఎస్, ఏపీలో వైసీపీ విజయాన్ని ఖరారు చేయడంతో బెట్టింగుబాబులంతా ఈ రెండు పార్టీలవైపే చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖుల విజయావకాశాలపై హైదరాబాద్‌లోనూ పంటర్లు పందేలు జోరుగా కాస్తున్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ ఎంత మెజారిటీ సాధిస్తుంది? అన్న విషయాల్లో పందేలు నడుస్తున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top