
సాక్షి, హైదరాబాద్: అవినీతి చరిత్ర కలిగిన కాంగ్రెస్‌పార్టీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మిలాఖత్ ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ సీనియర్‌నేత, కేంద్రమాజీమంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. శనివారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ అవినీతి శక్తులతో కలిసి చంద్రబాబు పనిచేస్తున్నాడన్నారు. అవకాశవాద రాజకీయాలకోసం ప్రధాని నరేంద్ర మోదీని అప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
ట్రిపుల్ తలాఖ్‌పై ఆర్డినెన్సు చేయడం రాజ్యాంగవిరుద్ధమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడటం సరికాదన్నారు. కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకోసం ఒవైసీ అలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. అయోధ్య విషయాన్ని రావణకాష్ఠంగా ఎప్పుడూ మండించాలని ఒవైసీ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. రానున్న కాలంలో బీజేపీలో భారీ చేరికలు ఉంటాయన్నారు. బీజేపీలో చేరడానికి చాలామంది యువకులు, వివిధపార్టీల్లోని ముఖ్యులు తమతో సంప్రదింపులు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో భావసారూప్య శక్తులు, గ్రూపులతో కలిసి వచ్చే ఎన్నికల్లో పనిచేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని దత్తాత్రేయ వెల్లడించారు.