పంచభూతాలనూ దోచుకుతింటున్నారు

bandaru amarnath fired on tdp leaders - Sakshi

దేవస్థానం భూసమస్యను గాలికొదిలేసిన టీడీపీ

మోసపూరిత హామీలతో బండారు, చంద్రబాబు వంచన

వైఎస్సార్‌ సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

పంచగ్రామాల్లో ముగిసిన మూడు రోజుల అదీప్‌రాజ్‌ పాదయాత్ర

పెందుర్తి: సింహాచలం దేవస్థానం భూసమస్య టీడీపీకి ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తుందని వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. పంచగ్రామాల సమస్యను గాలికొదిలేసిన టీడీపీ నాయకులు ఇక్కడున్న పంచభూతాలను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారం ఆశిస్తున్న వేలాది కుటుంబాల తరఫున పార్టీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చేపట్టిన పాదయాత్ర ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా వేపగుంట కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమర్‌నాథ్‌ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ప్రతిపక్షం నాయకులను బూతులు తిట్టడం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించే తీరిక లేదని ఎద్దేవా చేశారు.

భూసమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని, లేకపోతే రాజీనామా చేస్తానని బండారు అన్నమాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి రాలేదని గన్‌మెన్‌లను విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బండారుకు ప్రజాసమస్య పరిష్కరించడంలో సీఎం చంద్రబాబును ఎందుకు ఎదిరించలేకపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని చినబాబు(లోకేష్‌) దోచుకుంటుంటే పెందుర్తిని నాయుడుబాబు(బండారు కుమారుడు) లూటీ చేస్తున్నాడని ఆరోపించారు. మాటతప్పిన టీడీపీ నాయకులను రానున్న రోజుల్లో ప్రజలు అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి వైఎస్సార్‌ సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

పార్టీ అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి మాట్లాడుతూ భూసమస్య పరిష్కారం కోసం అదీప్‌రాజ్‌ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి కేబినెట్‌లోనే 100 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి ప్రజలను వంచించారన్నారు. సమస్యకు పీఠాధిపతులు, వైస్సార్‌సీసీ కారణమంటున్న టీడీపీ నాయకులు ఆ పీఠాధిపతుల వద్దకు వెళ్లి సత్కారాలు చేయించుకోలేదా అని ప్రశ్నించారు. వేదికపై అదీప్‌రాజ్, అమర్‌నాథ్, వరుదు కల్యాణిలను కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. సభకు పార్టీ 69వ వార్డు అధ్యక్షుడు దాసరి రాజు అధ్యక్షత వహించగా పార్టీ సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి కొండా రాజీవ్, నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు, మండల కన్వీనర్‌ నక్కా కనకరాజు, వార్డుల అధ్యక్షులు ముమ్మన వెంకటరమణ, కొలుసు ఈశ్వరరావు, శరగడం నరసింహమూర్తి, బట్టు సన్యాసిరావు, దాడి నూకరాజు, దొడ్డి కిరణ్, పార్టీ సీనియర్‌ నేతలు మల్లెల గురవారెడ్డి, మెంటి సూరిబాబు, వేలాది మంది కార్యకర్తలు, పంచగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 

Back to Top