'కరోనాను ఆయనే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు'

AP Minister Vellampalli Fires On Chandrababu And Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికలంటే ఎందుకు పారిపోతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విపక్షాలను ప్రశ్నించారు. చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పవన్‌..ఈ ముగ్గురు ఒక్కటే అని, వీరికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో వీరు ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదని తప్పుపట్టారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ఆటంకం కలిగించడానికి మొదటి నుంచి కూడా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అటు న్యాయస్థానాలు, ఇటు ఎన్నికల కమిషన్‌ నెపంతో ఎన్నికలను ఎదుర్కొలేకపోతున్నారు. ప్రభుత్వాలు సహజంగా ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తాయి. కానీ ఇక్కడ విచిత్రంగా ప్రభుత్వమే ఎన్నికలు పెడతామని ముందుకు వస్తోంది.

ప్రజలకు మంచి చేస్తే మాకు మంచి జరుగుతుందని మా ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వచ్చింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని, డబ్బులు, మద్యం పంపిణీ చేయకూడదని చట్టం చేశాం. చంద్రబాబు మొదలు ఆయన మౌత్‌పీస్‌లు అయిన పవన్‌ కళ్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ, వామపక్షాలు అందరూ కూడా వైఎస్‌ జగన్‌పై ఈ 9 నెలల్లో అనేక ఆరోపణలు చేశారు. సింగిల్‌గా వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు వెళ్తుంటే ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారు. మీరు రాయించిన స్క్రిప్ట్‌నే ఎన్నికల కమిషనర్‌ చదివారు. టీడీపీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషనర్ పని చేస్తున్నారు. సీఎస్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే ఎన్నికల కమిషనర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్‌ జగన్‌పై మీరు చేసిన అపవాదులు నిజమయితే ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తారు కదా? ఎందుకు ఎన్నికలు వాయిదా వేయించారు.

రాష్ట్రంలో ఒక్కకేసు మాత్రమే పాజిటివ్‌గా నమోదు అయింది. మోదీ మొదలు సీఎం వైఎస్‌ జగన్‌ వరకు అందరూ శుభ్రత గురించి చెప్పారు. చంద్రబాబు మాత్రం కరోనాను ఆయనే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు మనోధైర్యం కలిగించాలి. రాష్ట్రంలో లేని కరోనాను ఉన్నట్లుగా చెప్పడం దారుణం. చంద్రబాబు అండ్‌కో ఇదే పని చేస్తూ రాష్ట్ర బ్రాండ్‌ను దెబ్బతీస్తున్నారు.  ఎన్నికలు పూర్తి అయితే సుమారు రూ.5 వేల కోట్లు వస్తాయి. వైఎస్‌ జగన్‌పై వీరంతా పందుల్లా దాడి చేస్తున్నారు. రాష్ట్రానికి మంచి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ తపన పడుతుంటే కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్‌మీట్‌లు పెట్టి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐదు వేల కోట్లును పవన్, కన్నా రాష్ట్రానికి తేలాగరా..? అంటూ విమర్శించారు. చదవండి: 'చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమించరు'

చంద్రబాబు, కన్నా, పవన్‌..ఈ ముగ్గురిది ఒకే మాట. వేరే వేరే వేదికలు ఉన్నాయి అంతే. పవన్‌ మాట్లాడితే చాలు ఢిల్లీలో ఫిర్యాదు చేస్తా అంటున్నారు. ఈ 9 నెలల్లో పవన్‌ నీవేం చేశావ్‌. గతంలో పాచిపోయిన లడ్డూ అన్నావు. ఈ రోజు ఒక్క లడ్డైనా తీసుకురాగలిగావా?. ఇప్పుడేమో ఎన్నికలు రద్దు చేయాలంటున్నావు. నీవేవో షూటింగ్‌లు చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ ఎన్నికలు ఆపేయాలా? ప్రజలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి బీజేపీని అడగలేకపోతున్నారు. కన్నాను, పవన్‌ను, చంద్రబాబు కొడుకును ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి ఈ రాష్ట్రానికి మంచి జరుగకూడదని వీరి ఉద్దేశ్యమంటూ ధ్వజమెత్తారు. చదవండి: ‘అసెంబ్లీ తీర్మానం చెత్తబుట్టకే పరిమితం’ 

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల కంటే క్షుణ్ణంగా పని చేస్తున్నారు. చంద్రబాబు మాదిరిగా ప్రకృతిని మార్చలేరు కానీ, ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేం తప్పకుండా తీసుకుంటాం. సుప్రీం కోర్టు తలుపు తట్టాం. తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయంటే కారణం టీడీపీ, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి ఈ యనమల. కాగా రాష్ట్రంలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నా చంద్రబాబు మెప్పుకోసమే ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్‌ మనసు మార్చుకొని ఎన్నికలు యధాతధంగా నిర్వహించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top