
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కోరారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యయాని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. పౌరుల హక్కులు, ప్రతిపక్ష పార్టీల హక్కులు కాలరాయబడుతున్నాయి. బీజేపీ నేతలు అమిత్ షా, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఏలూరులో సీఎం పర్యటన పేరిట బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేయడం దారుణం. ఏపీలో ఇంత దుర్మార్గంగా దాడులు జరగడం ఇదే తొలిసారి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేదు కాబట్టే గవర్నర్‌ను జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేదు. టీడీపీ అధికారం ఇంకో ఆరు నెలలు మాత్రమేన’ని తెలిపారు.
బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ.. టీడీపీ నిరాశ నిస్పృహలతోనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతుందన్నారు. సీఎం దివాళా కోరు తనం వదిలి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి, నటి కవిత, అడ్వకేట్ హంస, త్రిపురనేని చిట్టిబాబు గవర్నర్‌ను కలసినవారిలో ఉన్నారు.