టీడీపీ నేతల తీరుపై మాజీమంత్రి ఆనం ఫైర్‌..

Anam Ramanarayana Reddy Fires On TTD Leaders In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇటీవల మంత్రి అఖిలప్రియ, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. నేడు టీడీపీ నేతల తీరుపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఆత్మకూరు మినీ మహానాడులో ఆనం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇన్ని అవమానాలు పడలేదని ఆయన తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వంపై 80 శాతం సంతృప్తి ఉందని చెప్పడం అబద్ధమన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉన్నా, జిల్లాలో వ్యవసాయ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆనం మండిపడ్డారు. మా సమస్యలు పట్టని ప్రభుత్వంలో మేము ఇంకా కొనసాగుతున్నామా అనే బాధ రైతుల్లో ఉంది, వారు తిరుగుబాటు చేసే పరిస్థితి దగ్గర్లో ఉందని ఆనం తెలిపారు.

‘అధికార పార్టీ ఇంచార్జిగా ఉన్న చార్జింగ్ మాత్రం లేదు. నేను కేవలం జెండా పట్టుకోవడానికే సరిపోతానా. ప్రజల సమస్యలు తీర్చడానికి నేను పనికిరానా. మినీ మహానాడు పెట్టుకుని మనకు మనమే భజన చేసుకుంటూ ఉంటే సరిపోతుందా. అభివృద్ధితోనే గెలుపు సాధ్యం కాదు. కార్యకర్తలకు అండగా ఉన్నప్పుడే విజయం వరిస్తుంది. జిల్లాలో ఉన్న వారి వద్ద నుంచి మాకు వ్యతిరేకత వస్తున్నప్పుడు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. నియోజక వర్గంలో ఎన్నో సమస్యలు. అభివృద్ధిపై ఎన్నిసార్లు చంద్రబాబుకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం. సోమశిల హైలెవల్ కెనాల్ ప్రారంభించి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ముప్పై శాతం పనులు కూడా పూర్తి కాలేదు. మొదటి దశ పూర్తి కాకముందే రెండవ దశకు టెండర్లు పిలుస్తున్నారు. కమీషన్ల కోసమా లేక రైతులను మభ్యపెట్టడానికా’. అని ప్రభుత్వ తీరుపై ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top