అమితోత్సాహం

Amit Shah to visit Karnataka today - Sakshi

నేటి నుంచి మైసూరులో బీజేపీ సారథి టూర్‌  

ఆలయ దర్శనం, స్వాములతో భేటీ

సాక్షి, బెంగళూరు: కమలదళ సారథి వారంరోజుల్లోనే మరో దఫా కన్నడనాట పర్యటనకు రాబోతున్నారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక ఆయన ప్రచార రణరంగంలోకి అడుగిడబోతున్నారు. గత ఎన్నికల్లో మైసూరు ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లోని (మైసూరు, చామరాజనగర, రామనగర, మండ్య) 26 అసెంబ్లీ సీట్లలో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పట్టు సాధించేందుకు కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు. ‘కరునాడ జాగృతి యాత్ర’లో భాగంగా బీజేపీ అధినేత అమిత్‌ షా శుక్ర, శనివారాల్లో మైసూరు పరిధిలో పర్యటించనున్నారు. ఇప్పటికే కర్ణాటకవ్యాప్తంగా అమిత్‌షా బెంగళూరు, హుబ్లీ–ధార్వాడ, మంగళూరు– ఉడుపి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కాంగ్రెస్‌ సారథి రాహుల్‌గాంధీ కూడా ఏప్రిల్‌ మొదటివారంలో మైసూరు పరిధిలో పర్యటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే మైసూరు పర్యటనలో ఉన్నారు.

రాజును కలుస్తారా?
కాగా మైసూరు మహరాజు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయర్‌ను అమిత్‌షా మైసూరు ప్యాలెస్‌లో రాజకుటుంబసభ్యులను కలిసే అవకాశం ఉంది. ఈ వార్తలను యదువీర్‌ ఖండించారు. కాగా అమిత్‌షా పర్యటనలో భాగంగా మైసూరు ప్రాంతంలోని పలు మఠాలను సందర్శించనున్నారు. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన పెద్దలను కలవనున్నారు. దీంతో పాటు ప్రముఖ నంజనగూడు శ్రీకంఠేశ్వర ఆలయం, మేలుకోటె చెలువనారాయణస్వామి ఆలయాన్ని సందర్శిస్తారని సమాచారం. అదేవిధంగా దళితులు, రైతులు, మహిళలతో సమావేశాలు నిర్వహిస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top