దమ్ముంటే అరెస్టు చేసుకోండి!

Amit Shah dares Mamata to arrest him amid war of words over Assam - Sakshi

కోల్‌కతా ర్యాలీపై అమిత్‌ షా సవాల్‌

బీజేపీ నన్నాపలేదు: మమత

న్యూఢిల్లీ/కోల్‌కతా: బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా,  పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం పెరిగింది. అస్సాం జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్నార్సీ) తుది ముసాయిదా విడుదలపై మమత ఎక్కువగా స్పందించడం, తదుపరి ఎన్నార్సీ పశ్చిమ బెంగాల్‌లో∙ఉండొచ్చన్న వార్తలతో బీజేపీ, టీఎంసీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11న కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించాలని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ యువమోర్చా నిర్ణయించింది. ఈ ర్యాలీలో అమిత్‌ షా పాల్గొననున్నారు. అస్సాం తరహాలో బెంగాల్‌లో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులను పంపించేస్తామని షా ప్రకటిస్తే ఇది రాజకీయంగా పెను ప్రభావం చూపుతుందనే కారణంతో ఈ ర్యాలీకి అనుమతివ్వబోమని మొదట కోల్‌కతా పోలీసులు ప్రకటించారు. దీనిపై షా స్పందిస్తూ.. ‘ఆగస్టు 11న ర్యాలీ నిర్వహిస్తాం. దమ్ముంటే అరెస్టు చేసుకోండి’ అని సవాల్‌ విసిరారు. తర్వాత పోలీసులు ర్యాలీకి ఓకే చెప్పారు.  

భారత్‌–బంగ్లా స్నేహానికి ఇబ్బంది!
సరైన ఓటర్లను ఎన్నార్సీలో కలపకుండా బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయం చేస్తోందని మమత విమర్శించారు. రేపు తననూ చొరబాటుదారు అంటారేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ‘నా తల్లిదండ్రులు ఇక్కడే పుట్టారనే జనన ధ్రువీకరణ పత్రాల్లేవు. అదృష్టవశాత్తూ నా వద్ద ఆ పత్రాలున్నాయి. కానీ నా తల్లిదండ్రులకు లేవని నన్ను చొరబాటుదారు అంటారేమో?’ అని మమత ఎద్దేవా చేశారు. ‘2019లో విపక్షాలు ఏకమవుతాయి. బీజేపీ పని అయిపోయినట్లే’ అని ఆమె అన్నారు. ‘నన్ను బీజేపీ ఆపలేదు. నేను వారి పనిమనిషిని కాను’ అని∙ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నార్సీ కారణంగా బంగ్లాదేశ్‌తో భారత్‌కున్న సత్సంబంధాలు దెబ్బతింటాయని ఆమె పేర్కొన్నారు. తాను ప్రధాని పదవిని ఆశించడం లేదని.. విపక్షాలన్నీ కలిసే ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటాయన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా సహా వైఎస్సార్‌సీపీ, ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ సహా పలు పార్టీల నేతలను కలిశారు. బీజేపీ నేత అడ్వాణీ, బీజేపీ నుంచి సస్పెండైన కీర్తీ ఆజాద్‌లను కలిశారు.

ఎన్నార్సీపై రచ్చ
అస్సాం ఎన్నార్సీ విషయంలో పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఎన్నార్సీపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ సహా పలువురు ఎంపీలు ఈ డిమాండ్‌తో సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. అయితే రికార్డులను పరిశీలిస్తానని చైర్మన్‌ వెంకయ్య నాయుడు కాంగ్రెస్‌ ఎంపీలకు భరోసా ఇచ్చారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కు తగ్గకపోవడంలో సభ పలుమార్లు వాయిదా పడింది. లోక్‌సభలోనూ తృణమూల్‌ ఎంపీలు ప్రభుత్వం తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top