సంచలన నిర్ణయం ఆర్టికల్‌ 370 రద్దు

Amit Shah Announced On Kashmir In Rajya Sabha - Sakshi

కశ్మీర్‌కు ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు

రాజ్యసభలో బిల్లును ప్రతిపాదించిన అమిత్‌ షా

కేంద్ర పాలిత ప్రాంతంగా లఢక్‌

సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌పై అనేక ఉత్కంఠ పరిణామాలకు తెరదించుతూ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రతిపాదించారు. కశ్మీర్‌ అంశంపై తొలినుంచి గోప్యతను పాటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా తన నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, వివాదాస్పదంగా ఉన్న ఆర్టికల్‌ 370 రద్దయింది. కాగా అమిత్‌ షా ప్రకటన మరుక్షణమే ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీంతో కశ్మీర్‌ ప్రత్యేక హక్కులను కోల్పోయి.. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులను కల్పించబడ్డాయి. ఇక పార్లమెంట్‌ చేసే ప్రతిచట్టం దేశమంతటితో పాటు కశ్మీర్‌లోనూ అమలు కానుంది.

కశ్మీర్‌ రెండుగా విభజన..
ఆర్టికల్‌ 370పై పక్కా వ్యూహాన్ని అమలు చేసిన అమిత్‌ షా.. ముందుగానే బిల్లుకు సంబంధించిన వాటిపై పూర్తి కసరత్తు చేసి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజన చేస్తూ.. మరో బిల్లును కూడా సభ ముందుకు తీసుకువచ్చారు. లఢక్‌ను పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుతూ బిల్లును రూపొందించారు. అలాగే చట్టసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ కానుంది. గత వారం రోజులుగా భద్రతా బలగాల మోహరింపుతో కల్లోలంగా మారిన కశ్మీర్‌ వ్యవహారం కీలక ప్రకటనతో ముగిసింది. అమిత్‌ షా ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ నిర్ణయం తీసుకుందని తీవ్రంగా మండిపడ్డాయి. 370 రద్దుపై రాజ్యసభలో సభ్యులు ఆందోళన నిర్వహించారు.

కాగా అమిత్‌ షా ప్రకటనకు ముందు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రిమండలి భేటీ అయిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా దేశానికి సమస్యగా మారిన కశ్మీర్‌ ప్రత్యేక హక్కుల అధికరణను తొలగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీని కోసం ఎన్నో రోజులుగా తీవ్ర కసరత్తు చేసిన మోదీ ప్రభుత్వం.. కీలక సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటించింది. కశ్మీర్‌కు సమస్యాత్మకంగా మారిన ఆర్టికల్‌ 35ఏ, 370 అధికరణలను రద్దు చేస్తామని గత ఎన్నికల సమయంలో అమిత్‌ షా ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పూర్తి బలంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈమేరకు కీలక ప్రకటన చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top