ఆయన్ను నమ్మితే కుక్క తోకతో గోదారి ఈదినట్లే

Ambati Rambabu Fires On TDP And BJP Over No confidence Motion - Sakshi

ఢిల్లీ వేదికగా టీడీపీ పెద్ద డ్రామాకు తెరలేపింది

రాజగురువుతో సమావేశం వెనుక రహస్యం ఏంటో చెప్పాలి

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడును నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం వైఎస్సా్‌ర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామకు తెరలేపిందని విమర్శించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో టీడీపీ కేంద్రంపై అవిశ్వాసంపై ప్రగల్భాలు పలుకుతోందని దుయ్యబట్టారు. కేంద్రంపై అందరికంటే ముందుగా అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని అన్నారు. ఎన్డీఏపై అవిశ్వాసం పెడితే విమర్శించిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో తొలిరోజే టీడీపీ ఆమోదం పొందడం వెనుక కుట్ర లేదా అని అంబటి ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇది కొత్త ట్విస్ట్ అని.. తమ పార్టీ పెట్టినప్పుడు ఎందుకు చర్చ జరపలేదని, ఎందుకు హెడ్ కౌంట్ చేయలేదని నిలదీశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారని, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదిరిందని, దానికి నేడు (బుధవారం) పార్లమెంట్‌లో జరిగిన సన్నివేశమే ఉదాహరణని అన్నారు. పార్లమెంట్‌లో జరుగుతున్న పరిణామాలపై ఎన్డీఏ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దేశం తలదించుకొనేలా సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తారా అంటూ రాంబాబు మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా మహాకుట్ర జరిగిందని, బీజేపీ, చంద్రబాబుల మధ్య లాలాచీ కుస్తీ జరిగిందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలపై తప్పుడు ప్రచారం చేస్తూ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎప్పుడైనా తిరుమల కొండపై స్వామివారి ఆలయం మూసివేశారా అని ప్రశ్నించారు. ఆ తరువాత నిర్ణయం ఎందుకు పునఃసమీక్షించారని నిలదీశారు. దీనిపై ప్రభుత్వం, పాలకమండలి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొండపై ఎదో జరుగుతోందని, స్వామివారితో పెట్టుకుంటే అనుభవించక తప్పదని అంబటి హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top