దేవుడి మంత్రిగా మళ్లీ ‘ఇంద్రుడే’

Allola Indrakaran Reddy Takes Oath As Minister In KCR Cabinet - Sakshi

గతంలో దేవాదాయశాఖ మంత్రులకు చేదు అనుభవాలు

మళ్లీ వరించని అమాత్య పదవి... ఎమ్మెల్యే కావడమే అరుదు 

ఏకంగా మళ్లీ దేవాదాయ శాఖ చేపట్టిన ఇంద్రకరణ్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌ : ఆలయాల శాఖకు అమాత్యులుగా పనిచేసిన వారికి అనంతర రాజకీయ జీవితంలో దేవుడి కరుణ మాత్రం కలగలేదు. గతంలో 8 మంది నేతలు దేవాదాయ మంత్రులుగా పనిచేశారు. వారిలో ఎవరినీ మరోసారి మంత్రి పదవి వరించలేదు. ఎమ్మెల్యేగా గెలవడమే కష్టమైందని చరిత్ర చెబుతోంది. కానీ, నిర్మల్‌ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం 36 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. గత కేబినెట్‌లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన ఆయన ఈసారి కూడా మంత్రి అయ్యారు. మంత్రి కావడమే కాదు... దేవాదాయ మంత్రిగా రికార్డు సృష్టించారు. (కేసీఆర్‌ వద్దే ఆర్థిక శాఖ )

చరిత్ర ఇదీ.. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి దేవాదాయ మంత్రిగా పనిచేసిన వారు మళ్లీ మంత్రి పదవి చేపట్టడం అనేది జరగలేదు. మంత్రి పదవి అటుంచితే తదుపరి ఎన్నికల్లో విజయం సాధించడమే గగనమైపోయింది. కొంతమందికైతే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. మరీ పూర్వం నుంచి కాదు గానీ 1983లో ఎన్టీఆర్‌ కేబినెట్‌లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన యతిరాజారావుతో పాటు 1994లో ఎన్టీఆర్‌ హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేత సింహాద్రి సత్యనారాయణ కూడా ఆ తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. ఇక 1995లో చంద్రబాబు కేబినెట్‌లో ఈ శాఖ నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు తదుపరి ఎన్నికల్లో గెలవలేదు.

ఇక 1999 ఎన్నికల తర్వాత ఏర్పడ్డ చంద్రబాబు కేబినెట్‌లో దండు శివరామరాజు దేవాదాయ శాఖ చేపట్టారు. 2004 ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. తర్వాత ఈ శాఖ చేపట్టిన ఎం.సత్యనారాయణరావు మధ్యలోనే పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాతి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెస్సార్‌ తర్వాత ఆయన సామాజిక వర్గానికే చెందిన జువ్వాడి రత్నాకర్‌రావు ఆ శాఖ చేపట్టారు. అయితే, 2009 ఎన్నికల్లోనూ, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలవలేదు. ఇక, 2009 ఎన్నికల తర్వాత దేవాదాయశాఖ చేపట్టిన గాదె వెంకట్‌రెడ్డికి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిపదవి దక్కలేదు.

ఎమ్మెస్సార్‌కు, రత్నాకర్‌రావుకు మధ్యలో కొన్ని నెలలు దేవాదాయ బాధ్యతలు నిర్వర్తించిన జేసీ దివాకర్‌రెడ్డికి 2009లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి పదవి రాలేదు. అప్పుడు దేవాదాయ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి కేబినెట్‌లో మంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత విస్తరణలో మంత్రి అయినా దేవాదాయశాఖ చేపట్టలేదు. అప్పుడు దేవాదాయ శాఖ బాధ్యతలు తీసుకున్న ఇంద్రకరణ్‌రెడ్డి 2018లో కేసీఆర్‌ ప్రభుత్వం రద్దయ్యేంతవరకు అదే శాఖ నిర్వహించారు. మళ్లీ 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచి మళ్లీ ఇప్పుడు కేసీఆర్‌ కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా నియమింపబడటం విశేషం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top