
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసు నుంచి టీడీపీ పెద్దలను కాపాడటానికి రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. ఈ ఘటన వెనుక చంద్రబాబుతో పాటు, టీడీపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ.. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే తమపై కేసులు నమోదు చేశారని తెలిపారు. తనతో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన మరో 58మందిపై కేసులు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం తమపై కక్షసాధింపుకు పాల్పడుతోందని విమర్శించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరగక ముందు, జరిగిన తరువాత, జరిగే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు, డీజపీ ఆర్పీ ఠాకూర్ కాల్ డేటాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.