అది ముమ్మాటికీ అక్రమ కట్టడమే : ఆర్కే

Alla Ramakrishna Reddy Challenge to Chandrababu and Lingamaneni - Sakshi

లింగమనేని అతిథి గృహంపై ఆర్కే

నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా

దమ్ముంటే చర్చకు రండి

చంద్రబాబు, లింగమనేనికి ఆర్కే సవాల్‌  

సాక్షి, అమరావతి: చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని అతిథి గృహం ముమ్మాటికీ అక్రమ నిర్మాణమేనని, చంద్రబాబు, లింగమనేని రమేశ్‌కు దమ్ముంటే ఈ అంశంపై చర్చకు రావాలని వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సవాల్‌ విసిరారు. అది అక్రమ కట్టడమని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు, అప్రతిష్ట పాలు చేసేందుకు లింగమనేనిపై ఒత్తిడి తెచ్చి ఆయనతో చంద్రబాబు సీఎం వైఎస్‌ జగన్‌కు లేఖ రాయించారన్నారు. గతంలో హైకోర్టు నోటీసులు ఇచ్చినా స్పందించని లింగమనేని ముఖ్యమంత్రికి లేఖ ఎలా రాశారని ప్రశ్నించారు.

దేవినేని ఉమా 2014లో కృష్ణా నదిలో తిరిగి మరీ నదీ గర్భంలోని నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలని చెప్పలేదా? అని నిలదీశారు. తాడేపల్లి తహసీల్దార్‌ లింగమనేనికి నోటీసులు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. 271 సర్వే నెంబర్‌ ప్రభుత్వ భూమి–కృష్ణా నది అని అడంగల్‌లో ఉందని, అలాగే 271–1బి ప్రభుత్వ భూమి డొంక అని రికార్డుల్లో ఉందని వివరించారు. ఇలాంటి ప్రభుత్వ భూమిలో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరానని లింగమనేని చెప్పడం ఏమిటన్నారు. ఇటీవల సీఆర్‌డీఏకి రాసిన లేఖలో తనవి 254, 250 సర్వే నెంబర్లు అని ఆయన పేర్కొన్నారని, వాస్తవానికి అవి లింగమనేనివి కానే కావన్నారు. ఆయన ఎక్కడా అనుమతులు తీసుకోలేదని.. తాను గ్రామ పంచాయతీ రికార్డులన్నింటినీ చూసి చెబుతున్నానని, పంచాయతీ అనుమతులుంటే తీసుకు రావాలని కోరారు. ఈతకొలను నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని ఏకంగా ఇల్లే కట్టారన్నారు. ఉడా అనుమతి ప్రకారం పట్టా భూమిలో నిర్మాణం చేయాల్సి ఉండగా ఏకంగా ప్రభుత్వ భూమిలోనే కట్టేశారన్నారు. 

ఇంటి అద్దె కింద రూ.1.2 కోట్లు తీసుకున్నారు
చంద్రబాబు, లోకేశ్‌ ఇద్దరూ ఇంటి అద్దె కింద శాసనసభ, శాసనమండలి నుంచి రూ.1.2 కోట్లు తీసుకున్నారని.. నిజంగా వారు ఇంటి అద్దె చెల్లించారా? చెల్లించి ఉంటే దాన్ని ఆదాయపు పన్ను చెల్లింపులో చూపించారా? అని ఎమ్మెల్యే ఆర్కే అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ లింగమనేని తన అతిథి గృహాన్ని ఉచితంగా ఇచ్చి ఉంటే మరి వారు ఇంటి అద్దెను ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. లింగమనేని ఎలాంటి ప్రతిఫలం లేకుండానే అతిథి గృహాన్ని చంద్రబాబుకు ఇచ్చారా? అని నిలదీశారు. రాజధాని ల్యాండ్‌పూలింగ్‌ను లింగమనేని భూముల వద్దకు వచ్చేటప్పటికే ఎందుకు ఆపేశారో చెప్పాలన్నారు. తానున్న అతిథి గృహం ప్రభుత్వ ఆస్తి అని గతంలో చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారని.. ఇప్పుడు మాత్రం మాట మార్చి అద్దెకు ఉంటున్నానని చెబుతున్నారని మండిపడ్డారు. లింగమనేని కూడా ఆ అతిథిగృహం తనది కాదని.. ఎప్పుడో ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పారని, ఇప్పుడేమో తనదేనని ప్రభుత్వానికి లేఖ రాశారని ధ్వజమెత్తారు. అనుమతులు లేకుండా నిర్మించారని ఆధారాలతో సహా ఉన్నప్పుడు ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top