అజిత్‌ చుట్టూ హైడ్రామా?

Ajit Pawar has switched off his mobile phone - Sakshi

ముంబై : పార్టీపై తిరుగుబాటు చేసి.. తిరిగి సొంత గూటికే చేరుకున్న నాయకుడు అజిత్‌ పవార్‌. ఎన్సీపీకి ఎదురుతిరిగి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన ఆయన.. తన వర్గం ఎమ్మెల్యేల అండ లేకపోవడం, పవార్‌ కుటుంబసభ్యులు ఒత్తిడి తేవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చేసిన తప్పు ఒప్పుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరిన అబ్బాయిని బాబాయ్‌ శరద్‌ పవార్‌ కూడా క్షమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో​ అజిత్‌ ఏమేరకు సర్దుకుపోతారన్నది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఆయన సీఎం పదవిపై కన్నేసినట్టు వార్తలు వస్తుండటంతో హైడ్రామా నెలకొంది. సంకీర్ణ పొత్తుల్లో భాగంగా రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని తమకు అప్పగించాలని ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో అజిత్‌ కామెంట్‌ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.

ఈ క్రమంలోనే అజిత్‌ పవార్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ కావడంతో హైడ్రామా నెలకొంది. ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైన వేళ అజిత్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసుకోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఎన్సీపీ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. అజిత్‌ ప్రస్తుతం తమకు అందుబాటులోనే ఉన్నారని, సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారని తెలిపారు. తరచూ కాల్స్‌ వస్తుండటంతో ఫోన్‌ స్విచ్చాప్‌ చేశారని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు అజిత్‌ సొంత నియోజకవర్గమైన బారామతిలో వెలిసిన పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భావి ముఖ్యమంత్రి అజిత్‌ పవారేనంటూ ఆయన మద్దతుదారులు బారామతిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయడం గమనార్హం. మరోవైపు ఉద్ధవ్‌ సర్కార్‌లో కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి అజిత్‌కు దక్కవచ్చునని వినిపిస్తోంది.

పదవుల పంపకాలు
మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో కూటమి పార్టీలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మధ్య పదవుల పంపకంపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. కూటమి నాయకుడైన శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు ప్రమాణం చేసే అవకాశముందని తెలుస్తోంది. పదవుల పంపకంలో భాగంగా ఎన్సీపీకి డిప్యూటీ చీఫ్‌ మినిష్టర్‌, కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవులు ఖరారైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి స్పీకర్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌, ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు నేడు మంత్రులుగా ప్రమాణం చేస్తారని కూటమి వర్గాలు తెలిపాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top