‘పేరు’ గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనా!

Adityanaths communal renaming spree overtakes the politics of development - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 2017లో ఆదిత్యనాథ్‌ యోగిని ఎంపిక చేసినప్పుడు ‘కరడుగట్టిన హిందూత్వ’ వాదిని ఎంపిక చేయడానికి తామేమి వెనకాడమని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. అప్పటికీ గోరఖ్‌పూర్‌ ఆలయానికి పీఠాధిపతిగా కొనసాగుతున్న ఆయనపై పలు దొమ్మి కేసులతోపాటు మత ఘర్షణలు, హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నించారంటూ పలు కేసులు ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచ్చాన తనపై ఉన్న అన్ని కేసులను తానే స్వయంగా కొట్టివేసుకున్నారు.

బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ను పాకిస్తాన్‌ టెర్రరిస్టుగా అభివర్ణించి, మసీదుల్లో హిందూ విగ్రహాలను ప్రతిష్టిస్తానంటూ ఆదిలోనే వివాదాస్పదుడిగా ముద్ర పడిన యోగి ఆదిత్యనాథ్‌ యూపీలోని అన్ని ముస్లిం ప్రాంతాల పేర్లను తొలగించి వాటి స్థానంలో హిందూ పేర్లను ప్రవేశ పెడుతూ పోతున్నారు. గోరఖ్‌పూర్‌లోని భారత వైమానిక దళానికి చెందిన విమానాశ్రయానికి మహాయోగి గోరఖ్‌నాథ్‌ పేరును పెట్టారు. ముఘల్‌సరాయ్‌ రైల్వేస్టేషన్‌కు పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జంక్షన్‌ అని, మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ కనుగొన్న అలహాబాద్‌ నగరం పేరు మార్చి ప్రయాగ్‌రాజ్‌ పేరు పెట్టారు. ఫైజాబాద్‌ జిల్లాను అయోధ్యగా మారుస్తున్నట్లు దీపావళి వేడుకల్లో ఆదిత్యనాథ్‌ ప్రకటించారు.

గతంలోనే ఉర్దూ బజార్‌ను హిందీ బజార్‌గా, హుమాయున్‌ నగర్‌ను హనుమాన్‌ నగర్‌గా మార్చారు. తాజ్‌ మహల్‌ పేరును కూడా మార్చి రామ్‌ మహల్‌ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో రామ రాజ్యాన్ని స్థాపిస్తానని ముఖ్యమంత్రయిన కొత్తలో ప్రకటించిన ఆయన పేర్ల ఆలోచనలో పడి ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయినట్లున్నారు. ఒక్క భారత్‌లోనే కాకుండా యావత్‌ ప్రపంచంలోనే పేద ప్రాంతంగా, పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిన రాష్ట్రంగా యూపీ ఇప్పుడు గుర్తింపు పొందింది.

సబ్‌ సహారా ఆఫ్రికాలో పుట్టడం కన్నా యూపీలో ఓ శిశువు జన్మిస్తే నెల లోపల ఆ శిశువు మరణించే అవకాశాలు రెండింతలు ఉన్నాయని ‘లాన్‌సెట్‌’ మెడికల్‌ జర్నల్‌ తాజా సంచికలో వెల్లడించింది. పొరుగునున్న నేపాల్‌కన్నా యూపీలో మనిషి ఆయుషు ప్రామాణం తక్కువ. నైజీరియా, బంగ్లాదేశ్‌లకన్నా సరాసరి రాష్ట్ర జీడీపీ రేటు తక్కువ. యూపీలోని కాన్పూర్‌ నగరాన్ని ప్రపంచంలోనే అతి కాలుష్యనగరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలనే ప్రకటించింది. ఇక మానవ అభివృద్ధి సూచికలో పాకిస్థాన్‌ కన్నా వెనకబడి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై యోగి దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top