పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలపై స్పందించిన రితేశ్‌

Actor Riteish Deshmukh Hits Back At Minister Piyush Goyal - Sakshi

ముంబై : తన తండ్రిపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన ఆరోపణల పట్ల రితేష్‌ దేశ్‌ముఖ్‌ స్పందించారు. మన మధ్యలేని వారి గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు రితేశ్‌. ఇంతకు విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌.. ‘26/11 దాడులు జరిగినప్పుడు దివంగత మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ తన కుమారుడు రితేశ్‌కు సినిమా అవకాశాలు ఇప్పించే ప్రక్రియలో బిజీగా ఉన్నార’ని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రితేష్‌.. ట్విటర్‌లో ఓ లేఖను పోస్ట్‌ చేశారు.

‘గౌరవనీయులైన మంత్రి.. 26/11 దాడులు జరిగినప్పుడు మా నాన్నతో కలిసి తాజ్‌ హోటల్‌ని సందర్శించిన మాట వాస్తవమే. కానీ మీరు ఆరోపించినట్లు ఆ సమయంలో నేను షూటింగ్‌లో బిజీగా ఉన్నానన్నది అబద్ధం. ఆయనకున్న పలుకుబడితో నాకు సినిమా అవకాశాలు ఇప్పించలేదు. నన్ను సినిమాలోకి తీసుకోవాలని ఏ దర్శకుడితో, నిర్మాతతో కానీ మా నాన్న చర్చించింది లేదు. ఆ విషయంలో నేను ఇప్పటికీ చాలా గర్వపడతాను.  ప్రశ్నించే హక్కు మీకు కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ లోకంలో లేని వ్యక్తి గురించి మీరు ఇలా ఆరోపించడం సరికాదు. ఏడేళ్ల క్రితం మీరు ఈ ప్రశ్న అడిగి ఉంటే మా నాన్న సమాధానం ఇచ్చేవారు. మీ ఎన్నికల ప్రచారాలకు ఆల్‌ ది బెస్ట్‌ సర్‌’ అని పేర్కొన్నారు రితేశ్‌.

2004 నుంచి 2008 వరకు విలాస్‌రావ్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012 ఆగస్టులో అనారోగ్యంతో ఆయన మరణించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top