ఆ కుటుంబాలకు 10లక్షల పరిహారం : వైఎస్‌ జగన్‌

10 Lakhs for Dead Fishermen Families, Says YS Jagan Mohan Reddy   - Sakshi

సాక్షి, అచ్చంపేట : ‘ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారు. మళ్లీ అందరినీ మోసం చేయడానికి ఒక్కో కులానికి మేనిఫెస్టోలో ఒక్కో పేజీ కేటాయిస్తారు. కానీ మత్స్యకారులకు ఇచ్చిన ఓ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. నాలుగున్నరేళ్లుగా ఒక్కసారైనా డీజిల్‌ ధరలపై సబ్సిడీ పెంచారా?’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. 217వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గం అచ్చంపేట జంక్షన్‌లో మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఏప్రిల్‌ 15నుంచి జూన్‌ 15 వరకు ఫిషింగ్‌ హాలిడేలో మత్స్యకారులకు అందించే ఆర్థికసాయం వందలో కేవలం 10మందికి మాత్రమే వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వంలో మత్స్యకారులకు పెన్షన్‌ రాదు.

మత్స్యకార కుటుంబాలకు చంద్రబాబు 130 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలను అమలుచేస్తామన్నారు. ఫిషింగ్‌ హాలిడే సమయంలో నెలకు మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెల్లించి ఆర్థికసాయం అందిస్తామన్నారు. రేషనలైజేషన్‌ పేరుతో ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లను టీడీపీ సర్కార్‌ మూసేయాలని చూస్తుందన్నారు. జూలై ముగుస్తున్నా స్కూలు పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం ఇవ్వడం లేదు. ఎందుకంటే.. పిల్లల తల్లిదండ్రులు వారిని ప్రభుత్వ స్కూళ్లు మాన్పించేసి నారాయణ, చైతన్య ప్రైవేట్‌ స్కూళ్లకు పంపిస్తారు. ఆ స్కూళ్లు చంద్రబాబు నాయుడు బినామీ, ఏపీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలు కనుక టీడీపీ సర్కార్‌ అలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు.

నూరు శాతం అక్షరాస్యత
పేదల పిల్లలు ఉన్నత చదువులు చదివితేనే ఆ కుటుంబాలు బాగు పడతాయి. ఇవాళ ఇంజినీరింగ్‌ చదవాలంటే ఫీజులు లక్ష రూపాయలు దాటుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.30 వేలే ఫీజులుగా చెల్లిస్తోంది. మిగిలిన డబ్బుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారంలోకి రావడం కోసం మాత్రమే చంద్రబాబు బీసీలపై ప్రేమ అంటారు. ఆపై వారికి ఏం చేయరు. పేదలు, బీసీలపై ప్రేమ చూపించి, వారి అభివృద్ధి కోసం కృషి చేసిన ఏకైక వ్యక్తి వైఎస్సార్‌ అని కొనియాడారు. పేదల కోసం తండ్రి వైఎస్సార్‌ ఒకడుగు ముందుకేస్తే ఆయన కొడుకుగా తాను రెండడుగులు ముందుకేస్తానని చెప్పారు. పిల్లలను చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చయినా చదివిస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. చదువుకునేటప్పుడు పిల్లలు హాస్టల్‌లో ఉంటే.. మెస్‌ ఛార్జీల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. మీ పిల్లలను బడికి పంపించండి. చిన్న పిల్లలను స్కూళ్లకు పంపిన తల్లులకు ఏడాదికి 15 వేల రూపాయలు అందిస్తాం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 32 శాతం మందికి చదువు రాదు. అధికారంలోకి వచ్చాక నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధిస్తాం. 

45 ఏళ్లకే పెన్షన్‌
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తాం. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15వరకు ఫిషింగ్‌ హాలిడేలో భాగంగా మత్స్యకారులకు నెలకు రూ.10 వేలు ఆర్థికసాయం. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామానికి చెందిన చదువుకున్న వారికి 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. స్థానికులు ఉండటంతో సులువుగా పెన్షన్‌, రేషన​ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను 72 గంటల్లో మంజూరు చేస్తాం. మత్స్యకారులకు డీజిల్‌ మీద సబ్సిడీ పెంచుతాం. మత్స్యకారులకు డీజిల్‌ పోసుకున్నప్పుడు సబ్సిడీ వచ్చేలా చూస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు కొర్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. 

బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ
ఆస్పత్రి బిల్లు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. కుటుంబ పెద్ద ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత విశ్రాంతి అవసరమైతే ఆ సమయంలో పేషెంట్‌కు ఆర్థిక సాయం చేస్తాం. దీర్ఘకాలిక వ్యాదులతో బాధ పడుతున్నవారికి నెలకు రూ.10 వేల పింఛన్‌ అందిస్తాం. అవ్వాతాతల పెన్షన్‌ వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి వారికి రూ.2 వేల పెన్షన్‌ ఇస్తాం. 

డీప్‌ పోర్టు కార్మికులకు భరోసా
డీప్‌ పోర్టులో పనిచేసే మత్స్య కార్మికులకు జీతాలను పెంచుతాం. కాకినాడ డీప్‌ పోర్టులో పనిచేస్తూ మృతిచెందిన కార్మికులకు కూడా రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు వైఎస్‌ జగన్‌. అధికారంలోకి రాగానే మెరైన్‌ వర్సిటీని ఏర్పాటు చేస్తాం. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తాం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే సున్నా వడ్డీకే రుణాలను పునరుద్ధరిస్తామని భరోసా కల్పించారు. అధికారంలోకి రాగానే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు.

మత్స్య సంపద పెరగాలి
మత్స్యకారులు అభివృద్ధి చెందాలంటే మత్స్య సంపద పెరగాలి. అయితే మన ప్రాంతంలో మత్స్య సంపద తగ్గిపోతుంది. కాకినాడలో వైఎస్సార్‌ పేరు మీదుగా మెరైన్‌ యూనివర్సిటీ స్థాపించాలని స్థానికుడు కోరారు. కచ్చితంగా ఓ వర్సిటీ ఏర్పాటుచేసి మత్స్య సంపద అభివృద్ధి కోసం కృషి చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. మత్స్య సంపదను సరిగా నిల్వచేసే సదుపాయాలు, కోల్డ్‌ స్టోరేజ్‌లు, మోడల్‌ మార్కెట్లు లేవని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని మరో వ్యక్తి కోరగా.. అధికారంలోకొచ్చాక అన్ని ఏర్పాటు చేస్తామన్నారు వైఎస్‌ జగన్‌.

చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోగా.. మా బ్యాంకుల్లో ఉన్న డబ్బు లాగేసుకున్నారు. మళ్లీ లక్ష రూపాయలు రుణాలు ఇస్తాం, 10వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు దొంగ హామీలు ఇస్తున్నారు. ఎవ్వరూ చంద్రబాబు హామీలను నమ్మోద్దని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం వల్ల తన భర్తకు ఆపరేషన్‌ చేపించి బతికించుకున్నట్లు చెప్పిన ఆ మహిళ వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యి వైఎస్సార్‌లా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.  కుమారి, కాకినాడ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top