దృష్టిని మలిచేది! | Sakshi
Sakshi News home page

దృష్టిని మలిచేది!

Published Thu, Jan 16 2014 3:00 AM

దృష్టిని మలిచేది!

ఆడవాళ్లూ, అమ్మాయిలూ అమ్మవారి ప్రతిరూపాలు.
 ‘యత్రాహం తత్ర పుణ్యాని యత్రాహం తత్ర కేశవః
 వనితాయాం అహం తస్మాత్ నారీ సర్వ జగన్మయీ’
 అంటున్నది అమ్మవారు, ‘లక్ష్మీతంత్రం’లో. అంటే, ‘నేను ఎక్కడ ఉంటే అక్కడ పుణ్యం. నేను ఎక్కడ ఉంటే అక్కడ కేశవుడు (భగవంతుడు) ఉంటారు. నేను ఆడవాళ్లందరిలో ఉన్నాను. కాబట్టి వారిని నా రూపంగా గౌరవించండి!’ అని.
 ఈ దేశంలో రోజు రోజుకీ ఆడవాళ్ల పట్ల హింస పెరిగిపోతున్నది. మనందరం ఆలోచించే ధోరణి మారాలి.                                                                

 ధనుర్మాసంలో ఒక అమ్మాయి తెల్లవారుజామున తల్లిదండ్రులతో కలిసి చిలుకూరు ఆలయానికి వచ్చింది. ఏడెనిమిదేళ్లుంటాయి. దర్శనం కోసం బారులు తీరిన జనంలో పట్టు లంగా, జాకెట్టు, నిం డుగా గాజులు, జడలో కనకాంబరాలు ధరించి వెళుతోంది- గోదా అమ్మవారిలా.
 
 నేను దగ్గరగా పిలిచాను. నవ్వుకుంటూ వచ్చింది.
 రెండొందల వరకు ఉన్న భక్తులను ఉద్దేశించి మైక్‌లో అడిగాను.
 ‘‘ఈ అమ్మాయిని చూస్తే గోదాదేవిలా ఉందా? లేదా?!’’ అవునని ఆమోదించారంతా. ఆ అమ్మాయిని అడిగాను, ‘‘ఈ డ్రెస్సు వేసుకోమని ఎవరన్నారు?’’
 వాళ్లమ్మను చూపిస్తూ అంది, ఆ అమ్మాయి, ‘‘మా అమ్మ చెప్పిం ది!’’ ఆ అమ్మాయి తల్లికి ముప్పయ్యేళ్లు ఉండవచ్చు. ఈ గుర్తింపుకి కొంచెం బెదిరినా, మన స్సులో ఆనందించినట్టే ఉంది.
 

 ఆ చిన్న అమ్మాయిని అభినందించిన విషయాన్ని గమనిస్తూ కొంచెం వెనకాలే ఉన్న జీన్స్ ప్యాంటు ధరించిన అమ్మాయి ‘నేనూ అలా తయారవుతానంటే ఎందుకు వద్దన్నావు?’ అంటూ తన నాన్నగారితో పోట్లాడడం విన్నాను. ఒక విధంగా ఆనందం. కొంచెం బాధ కూడా. దేశంలో విలువలు ఇంకా దిగజారకుండా ఉండాలంటే ఈ వయస్సులో పిల్లలకు జాగ్రత్తగా, అర్ధమయ్యేలా చెప్పాలి.
 ఒక అమ్మాయి నన్ను అడిగింది, ‘‘మీకు నచ్చిన దుస్తులే వేసుకోవాలా?!’’ అని. ఈ ప్రశ్నకూ నవ్వుకుంటూ సమాధానం ఇచ్చాను. ‘‘జీన్స్‌ప్యాంటు వేసుకున్నా నీవు అమ్మవారే... ఆఫీసుకో, విహారానికో ఎలా వెళ్లినా ఫర్వాలేదు. దేవాలయానికి ఒక దేవతలా తయారయి రామ్మా!’’ అన్నాను. ‘సరే’ అని మళ్లీ వచ్చినపుడు పరికిణీతో వచ్చింది. ఇదంతా గుర్తు చేసింది.
 
 జోత్స్నామివ స్త్రియం దృష్ట్వా యస్య చిత్తం ప్రసీదతి
 నాపధ్యాయతి యత్కించిత్ సమే ప్రియతమః మతః
 ‘ఎవరైతే లక్షణంగా ఉన్న అమ్మాయినిచూసి నన్నుగుర్తుకు తెచ్చుకుంటారో వారే నాకు ప్రియమైనవారు’ అన్నారు అమ్మవారు. ఎంతముఖ్యమైన సందేశం! మనపిల్లలకు పరిచయం చేయాలి కదా!
 మత్ తనుః వనితా సాక్షాత్ యోగీ కస్మాన్న పూజయేత్
 నకుర్యాత్ వృజినం నార్యాః కువృత్తం నస్మరేత్ స్త్రియాః
 ‘ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, వికారంగా ఆలోచించడం కూడా సహించను’ అంటున్నారు అమ్మవారు. ఆడవాళ్లను గౌరవించని దేశం ఎంత భయంకరంగా ఉంటుందో, అమ్మవారికి ఆగ్రహం కలిగితే ఎలా ఉంటుందో చెప్పి పెంచారు మా పెద్దలు. మనం కూడా పిల్లలకు అదే చెబుదాం.
 ఆడవాళ్లుగా ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడేలా స్త్రీలను గౌరవిద్దాం!
 సౌందర్ రాజన్ (చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు)

Advertisement
 
Advertisement
 
Advertisement