‘విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభించిన సాంస్కృతిక సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమం ఇంకా కొనసాగవలసే ఉన్నది’ అన్నారు
రస రాజధాని:
‘విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభించిన సాంస్కృతిక సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమం ఇంకా కొనసాగవలసే ఉన్నది’ అన్నారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య- ‘వేయి పడగలు ఎందుకు చదవాలి?’ అన్న వ్యాసంలో. 120 ఏండ్ల విశ్వనాథకు సాహిత్య నీరాజనం ‘రస రాజధాని’లో ఇదొక వ్యాసం. ఆ మహా నవల ఔన్నత్యాన్నీ, వచ్చిన విమర్శలనీ సమాంతరంగా స్పృశిస్తూనే రచయిత ఈ వ్యాసం రాశారు. మళ్లీ కొన్ని కొత్త అంశాలను పరిచయం చేశారు కూడా.
అయితే విశ్వనాథ ఆవిష్కరించిన అంశాన్ని, నిజానికి ఆయన వేదనని విమర్శకులు సరిగా అంచనా వేయలేకపోయారన్నదే సుప్రసన్నాచార్య ఆరోపణ. కానీ స్థలకాలాలను బట్టి విశ్వనాథ కొన్ని అవగాహనలలో ఇప్పుడు సామంజస్యం కనిపించకపోవచ్చునని కూడా రచయిత అంటారు. ఏ విధంగా చూసినా వేయిపడగలు నవల ఇతివృత్తం జీవలక్షణం కలిగి ఉంది. అభిమానులనీ, వ్యతిరేకులనీ కూడా అందుకే ఇంతగా ఆలోచింపజేస్తోంది.
ఈ వ్యాసంతో పాటు ఇంకా ‘మహాకవి విశ్వనాథ’, ‘వేదమే సీతాదేవి- తపసా జ్వలన్తీం’, ‘కల్పవృక్షం- బాలకాండ’, ‘మరోసారి వేయిపడగలు చదివిన అనుభవం’, ‘గిరికుమారుని ప్రేమగీతాలు’, ‘తొలిచివేసే విరహం’ వంటి 12 వ్యాసాలు ఉన్నాయి. విశ్వనాథ సాహిత్యం లేదా, అసలు సాహిత్యం మీద ఇటీవల వచ్చిన చిక్కనైన విమర్శ ‘రసరాజధాని’.
కల్హణ
రస రాజధాని:
120 ఏండ్ల విశ్వనాథకు సాహిత్య నీరాజనం;
రచన: ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య; పేజీలు: 158; వెల: 120; ప్రతులకు: రచయిత, ఇం.నం. 9-1-190, రాధికా థియేటర్ ఎదురుగా, గిర్మాజీపేట, వరంగల్-2