breaking news
Veyipadagalu
-
వేయి పడగలు ఎందుకు చదవాలి?
రస రాజధాని: ‘విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభించిన సాంస్కృతిక సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమం ఇంకా కొనసాగవలసే ఉన్నది’ అన్నారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య- ‘వేయి పడగలు ఎందుకు చదవాలి?’ అన్న వ్యాసంలో. 120 ఏండ్ల విశ్వనాథకు సాహిత్య నీరాజనం ‘రస రాజధాని’లో ఇదొక వ్యాసం. ఆ మహా నవల ఔన్నత్యాన్నీ, వచ్చిన విమర్శలనీ సమాంతరంగా స్పృశిస్తూనే రచయిత ఈ వ్యాసం రాశారు. మళ్లీ కొన్ని కొత్త అంశాలను పరిచయం చేశారు కూడా. అయితే విశ్వనాథ ఆవిష్కరించిన అంశాన్ని, నిజానికి ఆయన వేదనని విమర్శకులు సరిగా అంచనా వేయలేకపోయారన్నదే సుప్రసన్నాచార్య ఆరోపణ. కానీ స్థలకాలాలను బట్టి విశ్వనాథ కొన్ని అవగాహనలలో ఇప్పుడు సామంజస్యం కనిపించకపోవచ్చునని కూడా రచయిత అంటారు. ఏ విధంగా చూసినా వేయిపడగలు నవల ఇతివృత్తం జీవలక్షణం కలిగి ఉంది. అభిమానులనీ, వ్యతిరేకులనీ కూడా అందుకే ఇంతగా ఆలోచింపజేస్తోంది. ఈ వ్యాసంతో పాటు ఇంకా ‘మహాకవి విశ్వనాథ’, ‘వేదమే సీతాదేవి- తపసా జ్వలన్తీం’, ‘కల్పవృక్షం- బాలకాండ’, ‘మరోసారి వేయిపడగలు చదివిన అనుభవం’, ‘గిరికుమారుని ప్రేమగీతాలు’, ‘తొలిచివేసే విరహం’ వంటి 12 వ్యాసాలు ఉన్నాయి. విశ్వనాథ సాహిత్యం లేదా, అసలు సాహిత్యం మీద ఇటీవల వచ్చిన చిక్కనైన విమర్శ ‘రసరాజధాని’. కల్హణ రస రాజధాని: 120 ఏండ్ల విశ్వనాథకు సాహిత్య నీరాజనం; రచన: ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య; పేజీలు: 158; వెల: 120; ప్రతులకు: రచయిత, ఇం.నం. 9-1-190, రాధికా థియేటర్ ఎదురుగా, గిర్మాజీపేట, వరంగల్-2 -
విపుల ప్రపంచంలోకి వేయిపడగలు
వేయిపడగలు ఒక ఇతిహాసం. సుబ్బన్నపేట దేశంలోని ప్రతి పల్లెటూరుకు ప్రతినిధి. తాత్వికంగా ఇది భారతదేశం యొక్క వేల ఏండ్ల చరిత్ర, సంస్కృతి, రుషుల తపఃఫలమైన ఆధ్యాత్మిక ప్రపంచం. తెలుగువారి జీవన విధానం, ఆంగ్లేయుల రాకతో జరిగిన విపరీతమైన మార్పులు, వాటికి తట్టుకోలేక చలించిపోయిన జాతి అంతా ఇందులో ప్రతిబింబిస్తుంది. వేయిపడగలు ఒక వేదనామయమైన జాతీయ నవల. తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఎనభై ఏళ్ళ కింద తన ముప్పయి తొమ్మిదవ ఏట 1934లో రచించిన బృహన్నవల. ఈ నవల వెలువడిన నాటినుండి అనేకానేక చర్చలు, విమర్శలు, పరిశోధనలు జరిగాయి. ఇప్పటికీ చర్చకు వస్తున్నది. ఇంత పెద్ద నవల అయినా అనేకానేక ముద్రణలు పొంది ఈ తరం పాఠకులను కూడా చదివింప జేస్తున్నది. సామాజిక, రాజకీయ. సాంస్కృతిక, ఆర్థిక, విద్య మొదలైన పలు రంగాలలో బహుముఖాలుగా విస్తరించిన ఈ నవలను హిందీలోకి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించి ఉత్తర భారతీయులకు పరిచయం చేశారు. తరువాత గుజరాతీలోకి అనువదించబడింది. అయినా ఇంకా ఎన్నో భాషలలోకి రావలసిన ఆవశ్యకత ఉండేది. ముఖ్యంగా ప్రపంచ ప్రజలు చదువుకోవడానికి ఇంగ్లీషులోకి రావాలి. ఆ పని ఇప్పుడు విశ్వనాథ సాహిత్యపీఠం నెలకొల్పి ఎనలేని సాహితీసేవలందజేస్తున్న డాక్టర్ వెల్చాల కొండలరావు పూనుకోవడంతో సాధ్యపడింది. తెలుగు, ఇంగ్లీషు భాషలలో నిష్ణాతులు, రచయితలు, విమర్శకులు అయిన డా.కె.అరుణావ్యాస్, డా. వైదేహి శశిధర్, చేపూరి సుబ్బారావు, ఉప్పులూరి ఆత్రేయ శర్మ, ఎస్.నారాయణస్వామి అనువదించారు. ఎవరు ఏ అధ్యాయాలు అనువదించారో పీఠికలో వివరించారు. అయితే, ఐదుగురి అనువాదం ఒకే తీరులో ఉండి చదువరులకు అంతభేదం కనిపించకపోవడం విశేషం. తమ భాషా సంపదలను, వ్యక్తీకరణలను, వాక్యనిర్మాణాలను తమ శైలిలో కాక మూల రచయితకు అనుగుణంగా మలచుకున్న తీరు అద్భుతం. వేయిపడగలు ఒక ఇతిహాసం. సుబ్బన్నపేట దేశంలోని ప్రతి పల్లెటూరుకు ప్రతినిధి. తాత్వికంగా ఇది భారతదేశం యొక్క వేల ఏండ్ల చరిత్ర, సంస్కృతి, రుషుల తపఃఫలమైన ఆధ్యాత్మిక ప్రపంచం. తెలుగువారి జీవన విధానం, ఆంగ్లేయుల రాకతో జరిగిన విపరీతమైన మార్పులు, వాటికి తట్టుకోలేక చలించిపోయిన జాతి అంతా ఇందులో ప్రతిబింబిస్తుంది. భాషలోని తీపి, పటుత్వం, సారళ్యం, సరసం, చమత్కారం, గాంభీర్యం అంతా నవలలో పరచుకొని ప్రవహిస్తుంది. తెలుగువారి సంవత్సరాలు, రుతువులు, నెలలు, తిథులు, పగళ్ళు, రాత్రులు, వాటిని అనుసరించిన ప్రకృతి పాఠకునికి ఆకాలానుభూతిని కలిగిస్తుంది. శ్రావణమాసం మబ్బులు, శరత్కాలపు వెన్నెలలు, మాఘమాసం చలి, వైశాఖమాసం ఎండలు, బహుళపంచమి వెన్నెల, శుక్లపక్షపు వెన్నెల, పున్నమినాటి వెన్నెల, అమావాస్య చీకట్లు, ఒకటేమిటి ఈ నవలలో ఒక సంవత్సరంలోని అన్ని రోజుల ప్రకృతిని అనుభవించవచ్చు. ఇది తెలుగు సామాన్య ప్రజల క్యాలెండరు. రైతుల పంచాంగం. ఇవేకాక, ఎంతో వైభవంగా ఉన్న సంగీతం, నాట్యం, సాహిత్యం, తెలుగు కావ్యాలే కాదు, ఇంగ్లీషు ఫ్రెంచి భాషలలోని గొప్ప రచనలు, సంస్కృత భాషలోని గొప్ప కావ్యాలు, తెలుగు కీర్తనలు, జావళీలు, జానపదాలు చర్చించడాలు, విమర్శించడాలు, ప్రశంసించడాలు వంటివెన్నో నవలలో ఉన్నాయి. ఇంకా పురుషార్థాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ఉపనిషత్సారాంశాలు, బ్రహ్మవిద్య, బ్రహ్మజ్ఞానము, పరావిద్యా రహస్యాలు అనేకం నవలలో దర్శనమిస్తాయి. ప్రతీకలు, ప్రాగ్రూప దృక్పథాలు విగూఢంగా ఉన్నాయి. రచనా విధానంలో వ్యావహారికత, పలుకుబడులు, సామెతలు, జాతీయాలు, సంభాషణా చాతుర్యాలు, చమత్కారాలు, పాత్రోచితమైన హావభావ ప్రకటనలు, తెలుగు భాషా సౌకుమార్యమంతా కుప్పవోశారు. ఈ జీవసంపద అంతా ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నం కావడం, ఆ ధాటికి జాతి యావత్తు చలించిపోవడం చూసి ఒక మహాదుఃఖాన్ని అనుభవించారు విశ్వనాథ. అదే జీవుని వేదన అయింది. అదే వేయిపడగలు రాయడానికి, రామాయణ కల్పవృక్షం రాయడానికి పునాది అయింది. సరిగ్గా ఆ సమయంలోనే జాతీయవాదం, స్వాతంత్య్ర పోరాటం జరగడం, ఝాన్సీ రాణి మొదలుకొని గాంధీ వరకు జరిగిన పోరాట చరిత్ర విశ్వనాథ మనసును ఆవరించి ఉండడం ఈ నవల వెనుక కనిపించని నేపథ్యం. దాంపత్య ధర్మానికి బదులు ప్రేమలు, భోగాలు, లోలత్వాలు చోటుచేసుకోవడం, కుటుంబ సంబంధాలు తెగిపోవడం, ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయడమే కాదు, ఆ ప్రకృతి సంపదను భౌతికంగా మానసికంగా అనుభవించే కపటమెరుగని ప్రజలకు సౌకర్యాలపేరుతో యంత్రాలు వచ్చి సుఖాలను చిన్నాభిన్నం చేయడం, ఆవుతోగాని, ఏనుగుతోగాని, కుక్కతోగాని, చీమతోగాని మనుషులకుండే జీవానుబంధాన్ని తెంచే స్థితి రావడం చూసి విశ్వనాథ ఈ రచన చేశారు. అనువాదకులు అయిదుగురు దోసిలి నిండా పట్టిన ధాన్యంలో నుండి ఒక్క గింజ కూడా జారిపోనంత పదిలంగా ప్రతిపదాన్ని, వాక్యాన్ని ఇంగ్లీషులోనికి దించారు. కవిత్రయం మహాభారతాన్ని అనువదించడానికి స్వేచ్ఛను తీసుకున్నారు, కాని ఈ అనువాదకులు విశ్వనాథే తమ ముందు కూర్చుని ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత మూలవిధేయంగా అనువదించారు. పి.వి.నరసింహారావు చివరి మూడు అధ్యాయాలు అక్కరలేదని అనువాదం చేయలేదు. ఆ చొరవను ఈ అనువాదకులు తీసుకోలేదు. తెలుగు పద్యాలు, కీర్తనలు, జావళీలు, భంగిమలు, సంస్కృత కీర్తనలు మొదలైనవి యథాతథంగా ఇంగ్లీషు లిప్యంతరీకరణం చేసిన పాదసూచికల్లో వివరణ ఇచ్చారు. వీటిని భారతీయులు గ్రహిస్తారు, పాశ్చాత్యులు తెలుసుకుంటారు. వేయిపడగలు నిన్నటి నవల కాదు. అది నేటికీ సందర్భమే. ఒక ప్రజాజీవన వ్యవస్థ ఎట్లా ఉంటుంది? ఒక విద్యా వ్యవస్థ, ఒక వర్ణ వ్యవస్థ, ఒక మత సిద్ధాంతం, ఒక ప్రకృతిజీవనం ఇట్లా పదమూడు అంశాలను ఎత్తిచూపుతూ, ధర్మారావు, అరుంధతి, గిరిక, హరప్ప, రంగారావు, పసరిక మొదలైన పాత్రల విశేషాలను తెలుపుతూ ‘ముందుమాట’ రాశారు. వేయిపడగలు నవల సంప్రదాయవాదమా? వర్ణవివక్షతతో రాసిందా? మత పిడివాదం ఇందులో ఉందా? మొదలైన అనేక ప్రశ్నలకు వెల్చాల కొండలరావు సముచితమైన వాదంతో ‘ఇన్ డిఫెన్స్ ఆఫ్ వేయిపడగలు’ పేరుతో పీఠిక రాశారు. నవల చివరిలో ధర్మారావు అరుంధతితో అనిన మాటలు: ‘‘నీవు మిగిలితివి. నా జాతి శక్తివి. నాయదృష్టము. నీవు మిగిలితివి ’’. జాతి శక్తి మిగిలినదన్నాడు కాని నా అర్ధాంగివి, నా ప్రేయసివి, నా సౌందర్యరాశివి వంటివి ప్రయోగించలేదు. ఈ పాత్రలు వ్యక్తిత్వ పరిధికి మించినవి. రామేశ్వరశాస్త్రి పూర్వీకులనుండి ఇప్పటిదాకా సాగిన ఈ కథ ఒక జాతి కథ. థౌజండ్ హుడ్స్ (వేయి పడగలు ఆంగ్లానువాదం) సంపాదకుడు: చేపూరి సుబ్బారావు అనువాదకులు: కె.అరుణావ్యాస్, ఉప్పులూరి ఆత్రేయ శర్మ, ఎస్.నారాయణస్వామి, వైదేహీ శశిధర్, చేపూరి సుబ్బారావు. ప్రచురణ: విశ్వనాథ పబ్లికేషన్స్, విశ్వనాథ సాహిత్య పీఠం వెల: 1000 -
నిత్యనూతనం ‘వేయిపడగలు’
♦ ‘థౌజండ్ హుడ్స్’ ఆవిష్కరణ సభలో కొనియాడిన వక్తలు ♦ ఆంగ్లంలోకి అనువాదమైన కవిసామ్రాట్ నవల ♦ విశ్వనాథుడు తెలుగు వాడి ఆస్తి అన్న మండలి బుద్ధప్రసాద్ సాక్షి, హైదరాబాద్: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయిపడగలు’ నవల ఏ తరం వారికైనా నిత్యనూతనమైన సాహితీ గ్రంథమని , అది మానవ సమాజంలోని భిన్నకోణాలను ఆవిష్కరించిన మహారచన అని పలువురు వక్తలు ఆ నవల విశిష్టతను కొనియాడారు. ఆదివారం రవీంద్రభారతిలో విశ్వనాథ సాహితీపీఠం, హైదరాబాద్ భాషా సాంస్కృతిక సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ వెల్చాల కొండలరావు అధ్యక్షతన ‘థౌజండ్ హుడ్స్’(వేయిపడగలు) ఆంగ్ల గ్రంథావిష్కరణ సభ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అనువాద గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ తెలుగువారి ఆస్తి అని కొనియాడారు. వేయిపడగలు వెలువడిన 78ఏళ్ల తర్వాత డాక్టర్ వెల్చాల కొండలరావు ఆ నవలను ఆంగ్లంలో అనువదించి ఆ భాష మాట్లాడేవారికి పరిచ యం చేయడం అభినందనీయమన్నారు. విజయవాడలో పుట్టిన విశ్వనాథ సత్యనారాయణను కరీంనగర్ వాసులు అమితంగా అభిమానించేవారని చెప్పారు. ఎంపీ వినోద్ మాట్లాడుతూ భాషా, ప్రాంతీయ సంకుచితత్వం ఉండకూడదని కవిసామ్రాట్ చెప్పేవారన్నారు. విశ్వనాథ సాహిత్యపీఠం గౌరవాధ్యక్షుడు వెల్చాల కొండలరావు మాట్లాడుతూ విశ్వనాథ రాసిన నాటి కిన్నెరసాని పాటలే, నేటి కిన్నెరసాని ప్రాజెక్టుకు స్ఫూర్తిబాటలని చెప్పారు. ఆయన సాహిత్యంలో కిన్నెరసాని వాగు రసమై, రాగమై విరాజిల్లిందన్నారు. భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలుగులో విస్తృతమైన గ్రంథాలు రాసిన మహానుభావుడు విశ్వనాథుడని కొనియాడారు. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ఆ మహనీయుని రచనలు నేటి తరం ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సినీనటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ వేయిపడగలు తెలుగుజాతికి ఒక దర్పణమన్నారు. ప్రజా కవి సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ప్రకృతి అందాలను పాటల్లో బంధించిన గొప్ప సాహితీమూర్తి విశ్వనాథ వారు అని తెలిపారు. ఏపీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ భవిష్యత్తులో వచ్చే మార్పులను ముందే ఊహించి చెప్పిన గొప్ప కవిగా సత్యనారాయణ నిలిచారన్నారు. విశ్వనాథుని మనుమడు విశ్వనాథ సత్యనారాయణ మాట్లాడుతూ తన తాత తుదిశ్వాస విడిచే పావుగంట ముం దు వరకూ ఆయన కావ్య పఠనంలోనే గడిపిన కర్మయోగి అని చెప్పారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వనాథ రచించిన కిన్నెరసాని పాటల్లో భావుకవిత్వం తొణికిసలాడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ నర్తకి స్వాతీ సోమనాథ్ బృందం ప్రదర్శించిన కిన్నెరసాని నృత్యరూపకం ఆకట్టుకుంది. వేయిపడగలులోని ముఖ్యాంశాలు పుస్తకాన్ని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు, తెలంగాణ ఎ క్లాసికల్ కల్చర్ ఖజానా పుస్తకాన్ని ప్రఖ్యాత రచయిత బి. నర్సింగరావు, విశ్వనాథ రాసిననాటి కిన్నెరసాని పాటలే నేటి కిన్నెరసాని ప్రాజెక్టుకు స్ఫూర్తి పుస్తకాన్ని కె. శ్రీనివాస్ ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా సత్యనారాయణను, థౌజండ్ హుడ్స్ ఆంగ్ల అనువాదంలో భాగస్వాములైన పలువురిని సత్కరించారు. కార్యక్రమంలో తొలినేపథ్యగాయని లావు బాలసరస్వతీదేవి, వాడ్రేవు చినవీరభద్రుడు, సి.సుబ్బారావు, ఐనంపూడి శ్రీలక్ష్మి, డాక్టర్ అరుణ వ్యాస్, చీకోలు సుందరయ్య పాల్గొన్నారు.