ఆకాశవాణి తెలుగు పలికిన వేళ..!

ఆకాశవాణి తెలుగు పలికిన వేళ..!


ఒక్క తెలుగు ప్రాంతమే కాదు, దేశం యావత్తూ సమాజానికి దోహదపడే ఆలోచనలతో ప్రాణాలకు తెగించి పోరాడాలని సిద్ధమవుతున్న రోజులవి. స్వార్థం చంపుకోవాలనే త్యాగకాంక్ష బలపడుతుండగా మద్యపాన నిషేధం, అక్షరాస్యత, మూఢ నమ్మకాల నిర్మూలన, గ్రంథాలయోద్యమం, కుటీర పరిశ్రమలు, ఖాదీ, స్త్రీ జనోద్ధరణ వంటివి జన బాహుళ్యంలోకి వెళుతున్నాయి. ఈ ఉద్యమాలు విడివిడిగా, కలివిడిగా ఆవేశాన్నీ, ఆక్రోశాన్నీ పంచుతున్నాయి, పెంచుతున్నాయి. 1938 జూన్‌ 16న మద్రాసులో తెలుగు ప్రసారాలు మొదలైన సందర్భపు నేపథ్యం ఇది.



1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా జర్నలిజం విశ్వవ్యాప్తం కావడం మొదలైంది. 1914లోనే ఆంధ్రపత్రిక బొంబాయి నుంచి మద్రాసు తరలివచ్చి వారపత్రిక దిన పత్రికగా మారింది. ఎం.ఏ. చదివిన రెండవ తెలుగు వ్యక్తి, అనేక ఉద్యమాల భాగస్వామి, రచయిత గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రపత్రిక తొలి సంపాదకులు. కట్టమంచి రామలింగారెడ్డి తొలి ఆధునిక సాహిత్య విమర్శ ‘కవిత్వతత్వ విచారం’ వెలువడింది 1914 లోనే. కృష్ణా పత్రిక, శ్రీ సాధన వంటి ప్రధాన పత్రికలతోపాటు ఎన్నో ఇతర పత్రికలూ; 1924లో మొదలైన భారతి వెలుగులు చిమ్మడం ప్రత్యేకత. తెలుగు వచనాన్ని శక్తిమంతంగా రాసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథల సంపుటం 1915లో వెలువడింది. వేమనను యోగవాదిగా, ప్రయోజనశీలిగా పరిచయం చేస్తూ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చేసిన ప్రసంగాలు అప్పట్లో సంచలనం రేపుతున్నాయి. సమాజంపై రచనల ద్వారా ఈటెలు విసిరిన చలం ‘మాలపిల్ల’ సినిమా రచనలో భాగస్వామి అయిన సందర్భం కూడా ఇదే. గిడుగు రామమూర్తి వ్యవహారిక తెలుగు ఉద్యమం ఫలితంగా, పరివర్తన చెందిన తాపీ ధర్మారావు కొత్తపాళీతో వ్యవహారిక భాషకు పత్రికల ద్వారా, సినిమా ద్వారా కాగడా పట్టారు. సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రచురించిన గిడుగు రామమూర్తి వ్యాసం కారణంగా గూడవల్లి రామబ్రహ్మం ప్రజామిత్ర మాసపత్రిక వాడుక భాషలోకి 1934లో మారింది.



1938లో మొదలైన ‘ఆంధ్రప్రభ’కు తొలుత ఖాసా సుబ్బారావు సంపాదకుడైనా, వ్యవహారిక భాషలో చక్కని కాలమ్‌ రాసిన న్యాపతి నారాయణమూర్తి కొద్దికాలంలోనే బాధ్యతలు తీసుకున్నారు. కనుక వస్తుపరంగానే కాదు వ్యక్తీకరణపరంగా కూడా చాలా అర్థవంతమైన నేపథ్యం ఉన్న సమయంలో ఆకాశవాణి తెలుగు పలికింది. తెలుగు పత్రికలు, తెలుగు సినిమా, తర్వాతి కాలంలో తెలుగు టెలివిజన్‌ కూడా మొదలైన మద్రాసులోనే తెలుగు ఆకాశవాణి మొదలు కావడం ఔచిత్యమే.



మద్రాసు రేడియో క్లబ్‌ 1924లో ప్రసారాలు ప్రారంభిం చింది. అయితే మూడేళ్లకు మించి సాగలేదు. మళ్లీ 1930లో మద్రాసు పురపాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించినా పరిమితంగానే ఉండేవి. 1933లో తపాలా శాఖ ఉద్యోగి మహబూబ్‌ అలీ హైదరాబాద్‌లో చిన్న రేడియో కేంద్రం మొదలుపెట్టాడు. దీన్ని 1935లో నిజాం వశం చేసుకున్నాడు. నాలుగు భాషలలో సాగిన నిజాం రేడియోలో రాయప్రోలు రాజశేఖర్, భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గాచలం, కురుగంటి సీతారామయ్య, మహా రథి వంటి వారు పని చేశారు. నిజాం రేడియో 1950 ఏప్రిల్‌ 1న ఆకాశవాణి హైదరాబాద్‌గా మారింది. 1935 సెప్టెంబరులో మైసూరులోనూ, 1937 సెప్టెంబరులో తిరువాన్కూరు సంస్థానంలోనూ రేడియో కేంద్రాలు వచ్చాయి. అంటే మద్రాసు ఆకాశవాణి నాలుగు భాషలతో ప్రసారాలు ప్రారంభించే సమయానికి హైదరాబాద్, మైసూరు, తిరువాన్కూరు సంస్థానాలలో మాత్రమే రేడియో కేంద్రాలున్నాయి.



దేశంలో తొలిసారిగా 1921లో బొంబాయిలో స్వల్ప స్థాయిలో రేడియో ప్రసారాలు మొదలై 1927 జూలై 23కు ఒక గాడిన పడ్డాయి. కలకత్తా, మద్రాసు, హైదరాబాద్, బరోడా, మైసూరు వంటి చోట్ల వ్యాప్తి చెందాయి. 1936లో ఆలిండియా రేడియోగా నామకరణం జరిగింది. అదే సంవత్సరంలో రేడియో పత్రిక కూడా ఒక స్థిర రూపానికి వచ్చింది. ఈ పరిపక్వత మద్రాసు తెలుగు ఆకాశవాణి ప్రసారాలలో ద్యోతకమైంది. సాహితీవేత్త అచంట జానకీరామ్, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేసిన అయ్యగారి వీరభద్రరావు వంటి వారు తొలి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్స్‌. మల్లంపల్లి సోమశేఖర శర్మ తమ్ముడు ఉమామహేశ్వరరావు తొలి తెలుగు అనౌన్సర్‌ కాగా, గాయని విశ్వేశ్వరమ్మ చెల్లెలు భానుమతి మలి తెలుగు అనౌన్సర్‌. చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రారంభ ప్రసంగం చేయగా; గాత్ర కచేరి తర్వాత సర్‌ కూర్మా వెంకటరెడ్డి నాయుడు రేడియో గురించి మాట్లాడారు. గిడుగు రామమూర్తి, కోలవెన్ను రామకోటేశ్వరరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, అడవి బాపిరాజు వంటి వారు తొలి ప్రసంగాలు చేసినవారు. ముద్దుకృష్ణ రచించిన ‘అనార్కలి’ తొలి రేడియో నాటకం. సాహిత్య కార్యక్రమాలే కాక విద్యార్థులకు, గ్రామస్తులకు, వ్యవసాయదారులకు, సంగీతాభిలాషులకు తగిన రీతిలో తొలి దశలోనే ప్రయత్నాలు జరగడం విశేషం. తెలుగు ప్రసారాల నేపథ్యం ఎంత ఉజ్వలంగా ఉందో, తర్వాత గమనం కూడా అంతే గొప్పగా కనబడుతుంది.



(భాషా సాహిత్యాలకు ఆకాశవాణి చేసిన సేవ గురించి సాహిత్య అకాడమీ ఆగస్టు 28, 29 తేదీలలో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా)

డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్, సంచాలకులు, ఆకాశవాణి, తిరుపతి ‘ మొబైల్‌ : 94407 32392

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top