సంఘ సంస్కరణ పతాక! | Sakshi
Sakshi News home page

సంఘ సంస్కరణ పతాక!

Published Sat, Apr 11 2015 2:11 AM

సంఘ సంస్కరణ పతాక!

పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ఎందరో సంస్కర్తలు భారతీయ సమస్యల మూలాల్లోకి వెళ్లి సంఘ సంస్కరణలను చేపట్టారు. మహాత్మా జ్యోతిబా ఫూలే, డా॥బి.ఆర్.అంబేద్కర్ ఇద్దరూ హిందూ సమాజాన్ని-కుల శాపం నుంచి విముక్తి చేసేందుకు జీవితాన్ని అర్పించిన మహనీయులు. ఆధునిక మానవతా ఆలోచనాపరులైన రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి వంటి ప్రముఖులలో ఫూలే ఒకరు. ఫూలే 1827 ఏప్రిల్ 11వ తేదీన గోవిందరావు ఫూలే, షిమనాబాయి దంపతులకు జన్మించారు. అమెరికా స్వాతంత్య్ర పోరాటం నుంచి ఎంతో స్ఫూర్తి పొందారు. బ్రిటిష్ అణచివేత క్రూరంగా సాగుతున్న నేపథ్యంలో శాంతియుత ఉద్యమాలే పరిష్కారమని, విద్యావ్యాప్తే ఒక గొప్ప ఉద్యమ మని, మూఢవిశ్వాసాలు తొలగించాలని, మనిషిని స్వేచ్ఛగా ఆలోచింపజేయాలని పూనుకున్నారు. నాటి పాలకులైన పీష్వాలు బ్రాహ్మణ మహిళలతో పాటు సమాజంలోని మహిళలందరూ నిరక్షరాస్యు లుగా, మూఢవిశ్వాసాలతో జీవించాలని కట్టుదిట్టా లు చేశారు.
 
  ఫూలే వితంతువులకు చేయూతనివ్వ డం, నిమ్నవర్గాల బాలబాలికలకు పాఠశాలలు నడపడం అప్పట్లో సాహసోపేతమైన చర్య. తమ బడిలో చదువు చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తన భార్య సావిత్రీబాయి ఫూలేకు చదువు నేర్పి టీచర్‌గా తీర్చిదిద్దారు. ఆ విధంగా సావిత్రీ బాయి దేశంలోనే తొలి ఉపాధ్యాయురాలి గా చరిత్రలో నిలిచిపోయారు. బాల్య వివా హాల వలన 10-15 ఏళ్లకే విధవలయ్యేవారు. వీరు జీవితమంతా కుటుంబానికి, బంధువులకు చాకిరీ చేస్తూ బతుకు చాలించేవారు. సహజమైన కోరికల వలన, బంధుమిత్రుల లైంగిక దౌర్జన్యాల వలన వితంతువులు తల్లులయ్యేవారు. గర్భస్రావం కోసం రహస్యంగా ప్రయత్నాలు చేసినప్పుడు అవి వికటిం చి ఎంతో మంది చనిపోయేవారు. వీరి దుస్థితి చూసి కదిలిపోయిన ఫూలే, గర్భస్రావాలను నిరోధించి.. వారు పిల్లలు కనడానికి, ఆ తరువాత పెంచి పోషిం చుకోవడానికి ఆసరా అయ్యారు. వారి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించారు. బ్రాహ్మణ మహిళల, వితంతువుల సంస్కరణ చూసి బ్రాహ్మణ సమాజం ఫూలేపై హత్యా ప్రయత్నాలు చేశారు.

 ఫూలే స్ఫూర్తితో ఛత్రపతి సాహూ మహారాజ్ తన రాజ్యంలో 50 శాతం బ్రాహ్మణేతరులను ఉద్యోగులుగా తీసు కోవాలని నిర్ణయించారు. దీనికి బ్రాహ్మ ణులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. నేటి రిజర్వేషన్‌లకు అలా తొలి ప్రాతిపదిక వేసింది సాహూ మహారాజ్, సాయాజీ గైక్వాడ్, పూలే వంటి సంస్కర్తలే. అలాగే పీష్వాల పాలనలో విపరీతంగా పన్నులు వేసేవారు. బ్రాహ్మణులు వడ్డీ లకు ఇచ్చి రైతులను బానిసలుగా మార్చుకునేవారు. ఫూలే ‘రైతుల చెర్నాకోల’ పుస్తకం రాసి వారికి మద్ద తుగా నిలిచాడు. ఆయన రాసిన పుస్తకాలలో ‘గులాంగిరీ’ పుస్తకానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
 
 మెఖంజీ నారాయణ లోఖండే, రామయ్య తది తర మిత్రులతో కలసి ఫూలే 1873లో ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించారు. బట్టల మిల్లు కార్మికుల సమస్యలపై ఉద్యమించారు. 16 గంటల పని విధా నాన్ని తొలగించి 12 గంటలకు మార్చుకోగలిగారు. తన జీవిత కృషి ద్వారా ఫూలే దేశంలోని బీసీలకు ఆరాధ్య నాయకుడిగా, మార్గదర్శిగా ఎదిగారు. ఎం దరో సమకాలికులు, ఆ తర్వాతి తరాలు ఆయన నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాయి. అందరికీ విద్య అందించిననాడు, కులవివక్ష తొలగిననాడు, అం దరూ నిరాడంబరంగా పెళ్లిళ్లు  చేసుకున్న నాడు, అం దరికీ సమాన హక్కులు, అవకాశాలు లభించిన నాడు, చట్టసభలలో, అన్ని రంగాలలో బీసీలకు రిజ ర్వేషన్‌లు కల్పించిన నాడు, కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడంతో పాటు, కేంద్రంలో, రాష్ట్రంలో బీసీల కోసం జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌ను కేటాయించి సబ్ ప్లాన్‌లను అమ లు జరిపిన నాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశ యాలు నెరవేరతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జ్యోతిరావు ఫూలే జీవిత చరిత్రను, రచనలను పాఠ్యాంశాలలో చేర్చడంతో పాటు, వారి రచనలను అన్ని భాషలలోకి అనువదించి ప్రజలకు అందుబా టులో తీసుకురావడం అవసరం.
 (నేడు జ్యోతిబాపూలే 188వ జయంతి)
 (డా॥వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పూర్వసభ్యుడు, కేంద్ర పరిశోధనా సలహా సంఘం)
 మొబైల్: 9849912948

 

Advertisement
 
Advertisement
 
Advertisement