వైఫల్యాల మధ్య వైభవం బాధ

వైఫల్యాల మధ్య వైభవం బాధ


రాజకీయ తప్పిదాలు, చరిత్ర చేసిన గాయాలు అంత తొందరగా మాసిపోవు. కానీ గాయాల నుంచి కూడా లబ్ధి పొందేవారు ఉన్నకాల మిది. భింద్రన్‌వాలేను ఇప్పటికీ తమ ఆరాధ్యదైవంగా కొలిచేవారికి అక్కడ కొదవ లేదు.

 

అధికార పక్షాలు పాలనా వ్యవహారాల దగ్గర చతికిల పడితే విపత్కర పరిణామాలు తప్పవు. పంజాబ్‌లో జరుతున్నది అదే. ప్రకాశ్‌సింగ్ బాదల్ నాయకత్వంలోని  శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి ప్రభుత్వం నీరుగారిపోయిందని ఇటీవలి పరిణామాలే సాక్ష్యం చెబుతాయి. పంజాబ్ వంటి రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడడం ఇందుకు పెద్ద నిదర్శనం. అంతే కాదు, నాయకత్వ వైఫల్యం వల్ల, గతంలో ఎన్నో గాయాలను చవిచూసిన ఆ సరిహద్దు రాష్ట్రంలో సద్దుమణిగినట్టు భావించిన సంక్షోభాలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఈ నెల ఆరున స్వర్ణ దేవాలయంలో జరిగిన ఘటనలు ఇందుకు సంబంధించినవే.



 దేశ విభజనలో ఎంతో విషాదాన్ని మూటగట్టుకున్న ప్రాంతం పంజాబ్. సిక్కులు గాయపడిన జాతి. కాలం, రూ పం వేరు కావచ్చు కానీ, 1980 దశకంలో ఆ రాష్ట్రాన్ని కుది పేసిన ఖలిస్థాన్ రగడ ఆ దారుణ విషాదాలకు కొనసాగింపు అనే అనుకోవాలి. ఖలిస్థాన్ ఏర్పాటు నినాదంతో ఆరంభ మైన ఆందోళన ఆధునిక భారత చరిత్రలోనే రక్తసిక్త వాక్యం. ఖలిస్థాన్ పరిణామాల పతాక సన్నివేశమే ఆపరేషన్ బ్లూ స్టార్.  1984లో జూన్ 3-8 మధ్య హర్మిందర్ సాహెబ్ లేదా స్వర్ణదేవాలయం మీద జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ (సైనిక చర్య) సిక్కుల మనసులను తీవ్రంగానే గాయపరిచింది. ఖలి స్థాన్ ఏర్పాటు నినాదంతో ఉగ్రవాద పంథాలో ఉద్యమిం చిన సంత్ జర్నయిల్‌సింగ్ భింద్రన్‌వాలే ఆ మందిరాన్ని కేంద్ర కార్యాలయం చేసుకున్నాడు. నాటి ప్రధాని ఇందిర ఆదేశం మేరకు సైన్యం దాడి చేసింది. తదనంతర పరిణా మాలు అత్యంత విషాదకరమైనవి. ఆపరేషన్ బ్లూస్టార్ అనంతర పరిణామం ఇందిరాగాంధీ దారుణ హత్య. ఇందిర హత్య తదనంతర పరిణామం ఢిల్లీలో, దేశంలో సిక్కుల ఊచకోత. ఇవన్నీ చరిత్ర మీద బాధాకరమైన ముద్రలను వేసి వెళ్లాయి. ఇదంతా గతం.

 ఆపరేషన్ బ్లూస్టార్ దుర్ఘటన జరిగి 30 సంవత్సరాలు గ డిచిన సందర్భంగా మొన్న ఆరోతేదీన స్వర్ణ దేవాలయంలో కార్యక్రమం జరిగినపుడు అవాంఛనీయ పరిణామాలు చో టు చేసుకున్నాయి. ఖలిస్థాన్ అనుకూల నినాదాలు వినిపిం చాయి. ఆ అంశాన్ని సమర్థిస్తున్నవారు, ఇతరుల మధ్య ఘర్ష ణ జరిగింది. మత చిహ్నంగా సిక్కులు దరించే కరవాలా లతోనే, అది కూడా స్వర్ణ ఆలయంలోనే ఘర్షణకు దిగారు. పన్నెండు మంది గాయపడ్డారు. ఇదో ప్రమాద హెచ్చరిక.



రాజకీయ తప్పిదాలు, చరిత్ర చేసిన గాయాలు అంత తొందరగా మాసిపోవు. కానీ గాయాల నుంచి కూడా లబ్ధి పొందేవారు ఉన్నకాలమిది. భింద్రన్‌వాలేను ఇప్పటికీ తమ ఆరాధ్యదైవంగా కొలిచేవారికి అక్కడ కొదవ లేదు. దేని మీద అయినా వ్యాపారం చేయగలిగిన ఘనులకు ఈ ఒక్క అంశం చాలు. అందుకే భింద్రన్‌వాలే ముఖాన్ని ముద్రించిన చొక్కా లను కొద్దికాలంగా అమృత్‌సర్ పరిసరాలలో విపరీతంగా అమ్ముతున్నారు. సున్నిత అంశానికి లొంగిపోయేవారే ఎప్పు డూ ఎక్కువమంది ఉంటారు. ముఖ్యంగా యువతరం ఇం దుకు లక్ష్యంగా ఉంటారు. అందుకే భింద్రన్‌వాలే బొమ్మ ము ద్రించిన టీ షర్టులు వేసుకుని కనిపించే సిక్కు యువకులు తరుచు కనిపిస్తున్నారు. 1980 దశకంలో ఆ ఉద్యమం ఏం సాధించిందో చాలామందికి అక్కరలేదు. అయినా భింద్రన్ వాలేను ఆరాధించేవారు కనిపిస్తూనే ఉన్నారు. ఇందుకు చా లా కారణాలు చెబుతున్నారు. సిక్కు యువకులు ప్రస్తుతం మత్తుమందులలో తేలియాడుతున్నారు. వారికి ఏదో విధమై న ‘ప్రతిష్ట’ కావాలి. కానీ ఆ రాష్ట్ర నాయకులలో  యువకు లకు ప్రేరణ ఇవ్వగలిగిన నాయకులు ఇప్పుడు ఎవరూ లేరు. అందుకే భింద్రన్‌వాలేను జ్ఞాపకానికి ప్రాణ ప్రతిష్ట చేయాలని చూస్తున్నారు. 80 దశకంలో అతడి పేరు వింటే భారతదేశం మొత్తం గడగడలాడిపోయి ఉండవచ్చు. కానీ కొందరు దారి తప్పిన సిక్కుల దృష్టిలో ఆయన ఓ వీరుడు. ఇలాంటి జాడలే ప్రస్తుతం పంజాబ్‌లో కనిపిస్తున్నాయి. ఈ అంశాన్ని సుస్పష్టంగా ప్రపంచం ఆవిష్కరించినదే జూన్ ఆరు నాటి ఘటన.

 సిక్కు యువకులు ప్రస్తుతం ‘వైభవం’ కోసం పాకులా డుతున్నారు. అందుకే సంచలనంలో కూడా వారికి వైభవం కనిపిస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్‌లో అలాంటి అంశాలు కనిపించాయి. అందుకే దేశంలో ఎక్కడా ఒక్క సీటు కూడా గెలుచుకోని ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. మోడీ కంటే కేజ్రీవాల్‌లోనే వారికి ‘హీరో’ కనిపించాడు. ఇదంతా చూస్తుంటే సిక్కులు గత వైభవం కోసం అర్రులు చాస్తున్నారని అనుకోలేం. గత గాయాలు వారిని మళ్లీ బాధపెట్టడం మొదలయిందనడమే నిజం. భింద్రన్‌వాలే నామస్మరణ దానికో పైపూత మాత్రమే.

 

డాక్టర్ గోపరాజు నారాయణరావు

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top