విమర్శ–ప్రతి విమర్శ | Criticism - Every criticism | Sakshi
Sakshi News home page

విమర్శ–ప్రతి విమర్శ

May 11 2017 12:27 AM | Updated on Sep 5 2017 10:51 AM

విమర్శ–ప్రతి విమర్శ

విమర్శ–ప్రతి విమర్శ

46 సంవత్సరాల కాలమ్‌ రచనలో ఎన్నో అనుభవాలు.

జీవన కాలమ్‌

విమర్శ ఎదుటి వ్యక్తిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది. కుసంస్కారానికి కాలు దువ్వుతుంది. ఇద్దరి మధ్యా బాంధవ్యాన్ని చెడగొడుతుంది.

46 సంవత్సరాల కాలమ్‌ రచనలో ఎన్నో అనుభవాలు. ఒకసారి ఒక బడుగు వర్గం గురించి రాస్తే వెంటనే స్పందన వచ్చింది: ‘లం.. కొడకా! మా గురించి నీకేం తెలుసురా. దమ్ముంటే ఈ విషయాలు రాయి’ అని. నాకు దమ్ముంది. ఆ విషయాల్ని రాశాను–తిట్టుని భద్రంగా జతచేస్తూ. నాకు కొన్ని వేల అభినందనలు అందాయి. కాసిన్ని విమర్శలకి చోటు ఉండకపోదు. ప్రతి విమర్శ– కుసంస్కారి ఆయుధం. ప్రతి స్పందన సంస్కారి సవరణ. నాకెప్పుడూ ‘మున్నాభాయ్‌’ సినిమాలో ఈ సన్నివేశం చాలా ఇష్టం. ఒకాయన ఇంట్లోకి వెళ్తూ పక్కింటి గోడమీద కిళ్లీ ఉమ్ము పుసుక్కున వేసి వెళ్తుంటాడు. ఆ చర్యని చూసిన హీరో నవ్వుకుంటాడు. ఒక బకెట్‌తో నీళ్లు తెచ్చి–కిళ్లీ మరకని శ్రద్ధగా తుడుస్తాడు. ఈ పనిని ఉమ్ము వేసిన వ్యక్తి గమనించాడు. తనని తిట్టడేం? నిలదీయడేం? మరునాడూ ఉమ్ము వేశాడు. మరునాడూ ఉమ్ముని జాగ్రత్తగా ఇతను కడిగాడు. నాలుగోనాడు ఉమ్మువేస్తూ–కాస్త ఆగాడు. ఈసారి ఉమ్ము వేయాలనిపించలేదు. ఎదుటి వ్యక్తి తలవొంచడం ఇతని తలని దించింది. ముందుకు సాగాడు. సంస్కరణ సంస్కారాన్ని తట్టి లేపుతుంది. అసహిష్ణుత–అహంకారాన్ని రెచ్చగొడుతుంది.

బెర్నార్డ్‌షా అనుకుంటాను –  తిట్టారట – ‘లం.. కొడకా’ అని. అతను నవ్వి ‘లాభం లేదు సార్‌. మా అమ్మ ‘లం..’ అయివుంటే మా జీవితాల్లో ఆకలి ఉండేది కాదు’ అన్నాడట. ఈ మధ్య అతి సరదా అయిన సందర్భం కనిపిం చింది. ఐపీఎల్‌ పోటీల్లో రైజింగ్‌ çపుణే సూపర్‌జైంట్స్‌ పక్షాన ఒకనాటి చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మొదటి ఆటని స్మిత్‌ ఆట కారణంగా ఆ టీమ్‌ గెలిచింది. మంచిదే. అయితే ఆ టీమ్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా తమ్ముడు హర్‌ గోయెంకా ధోనీని ఎద్దేవా చేశాడు. కానీ ధోనీ స్పందించలేదు. ఏతావాతా అతని భార్య సాక్షి స్పందించింది. ట్వీటర్‌లో సమాధానం ఇచ్చింది. వాట్సప్‌లో ‘కర్మ’ను జొప్పించింది.

‘పక్షి ప్రాణంతో ఉన్నప్పుడు పురుగుల్ని తింటుంది. ప్రాణం పోయాక పురుగులు పక్షిని తింటాయి. కాలమూ, పరిస్థితులూ ఎప్పుడైనా మారుతాయి. జీవి తంలో ఎవరినీ తక్కువ చేయవద్దు. ఇవాళ నువ్వు శక్తివంతుడివి కావచ్చు. కానీ కాలం నీకంటే శక్తివంతమైనది. ఒక్క చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. కానీ ఒక్క అగ్గిపుల్లతో లక్షల చెట్లు బూడిదవుతాయి. కనుక మంచిగా ఉండు. మంచిని చెయ్యి’. విమర్శ ఎదుటి వ్యక్తిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది. కుసంస్కారానికి కాలు దువ్వుతుంది. ఇద్దరి మధ్యా బాంధవ్యాన్ని చెడగొడుతుంది. ఒక ‘విమర్శ’ ఒక మిత్రుడినో, ఒక హితుడనో నష్టపోవడానికి అవసరమా? ‘అభిప్రాయభేదం’ అభివృద్ధికి సంకేతం.

ఎదుటివ్యక్తి ‘హక్కు’ని, ‘పరిమితి’ని, ‘దృక్పథాన్ని’, ‘దృష్టి’ని ఎరగడం. మా అబ్బాయి దర్శకత్వం వహించిన చిత్రానికి పని చేయడం నాకెంతమాత్రం ఇష్టం లేదు. విమర్శించే గొప్ప అవకాశాన్ని నేనూ, సవరించే గొప్ప ఊతాన్ని మా అబ్బాయీ నష్టపోతామని. మిత్రులు పాత్రో, జంధ్యాల, ఆకెళ్ల–ఇలా ఎంతమందికో ఫోన్లు చేశాను. చివరికి నిర్మాత, మిత్రులు అట్లూరి పూర్ణచంద్రరావుగారు– కొడుకుకి దన్నుగా నిలబడటం తప్పుకాదని నాతల వొంచారు. తర్వాత చాలా అనర్థాలను చేయవలసి వచ్చింది. అది వేరే కథ.

ఓ సంఘటనని నేనెన్నడూ మరచిపోలేను. ఆలిం డియా రేడియోలో చేరే నాటికి నా వయస్సు 23. మా చుట్టూ మహానుభావులైన వ్యక్తులు. వారిలో ఒకరు– మహా రచయిత ‘బుచ్చిబాబు’. రోజూ జరిగే ప్రోగ్రాం మీటింగులో గత రాత్రి ప్రసారమయిన బుచ్చిబాబుగారి కార్యక్రమాన్ని ఒక ఉత్తర దేశపు ఆఫీసరు చీల్చి చెండాడారు. మేమంతా కంగారుగా, ఇబ్బందిగా వింటున్నాం. మాకు బుచ్చిబాబు ఒక ఐకాన్‌. సభలో హేమాహేమీలు. చివరలో బుచ్చిబాబు ఎలా స్పందిస్తారు? బుచ్చిబాబుగారికి ఉబ్బసం ఉండేది. ఉత్తర దేశపు ఆఫీసరు విసురు అయాక–సభ అంతా నిశ్శబ్దమయిపోయింది. బుచ్చిబాబు చిరునవ్వు నవ్వారు.

ఆ ఆఫీసరు వేపు తిరిగి ‘మీ మాటల్లో నా పొరపాట్లు తెలుసుకున్నాను. తప్పకుండా దిద్దుకుంటాను’ అన్నారు. పెద్ద వజ్రాయుధం విసిరిన యోధుడిని–కేవలం తులసీదళంతో జయించిన సందర్భం అది. ఆయన చేసింది ‘తప్పు’ అయితే ఎవరూ ఆయన్ని ఉరి తియ్యరు. ఆ అవసరం లేకుండానే అవలీలగా ఆయన్ని బుచ్చిబాబు జయించారు. ఏమయింది? బుచ్చిబాబు పొరపాటు కాదు–పొరపాటుని అంగీకరించే పెద్దరికం–పొరపాటుని ఎత్తిచూపి, ఒక పెద్ద వాగ్యుద్ధానికి సిద్ధపడిన ప్రత్యర్థిని చిత్తు చేసింది. ‘విమర్శ’ ఓ గొప్ప బాంధవ్యాన్ని నేలరాసే ఆయుధం. సమీక్ష కొత్త స్నేహాన్ని పురికొల్పే అవకాశం. హితవు– పెద్ద దిక్కు. సంయమనం–వ్యక్తి శీలానికి పట్టాభిషేకం.


గొల్లపూడి మారుతీరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement