డల్లాస్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

YS Rajasekhara Reddy Jayanti Celebrations At Dallas - Sakshi

డల్లాస్‌ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి ఉత్సావాలను అమెరికాలోని ప్రవాసాంధ్రులు డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు మహానేతకు నివాళులు అర్పించారు. రాజన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నేత అని కొనియాడారు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరితోను ఆప్యాయంగా ఉంటారని వైఎస్సార్‌తో ఉన్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయిన వైఎస్‌ జగన్ రూపంలో అందరితో ఉన్నారని అన్నారు.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ఆర్‌లాగే విలువలకు కట్టుబడి ఉంటారని, పార్టీలో అందరిని సమానం చూస్తారని చెప్పారు. చిన్నా పెద్ద భేదం లేకుండా వైఎస్‌ జగన్ అందరినీ అన్నా అని ఆప్యాయంగా పిలుస్తారని అన్నారు. టీడీపీ, బీజేపీ, పవన్‌ కలిసి పోటీ చేస్తే, వైఎస్‌ జగన్‌ మాత్రం ఒంటరిగా పోటీ చేసి ఒక్కశాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరం అయ్యారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కుయుక్తులు ఎత్తుగడలు పనిచేయవని, ప్రజా తీర్పు ముందు తల వంచక తప్పదని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ దివంగత నేతతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన భర్తపై అక్రమ కేసులు బనాయించినప్పుడు, తన నియోజక వర్గంలో ప్రమాదం జరిగినప్పుడు మహానేత తన ఢిల్లీ ప్రయాణాన్ని రద్దు చేసుకొని వచ్చి కష్ట సమయాల్లో అండగా ఉన్నారని అన్నారు. అనంతరం కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన గొప్పనేత వైఎస్‌ఆర్‌ వెల్లడించారు. ఎన్నికల్లో గెలవడం కోసం వైఎస్‌ జగన్‌ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడానికి ఇష్ట పడలేదని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలను వేధింపులకు గురించేసిందని విమర్శించారు. పార్టీ కేడర్‌ను నాశనం చేయాలని ప్రయత్నించిందని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ పక్క పార్టీ నుంచి వచ్చినా తనను అమ్మలా ఆదరించిన గొప్ప వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని అన్నారు. ఒకప్పుడు దుర్యోధనుడు, ఇప్పడు చంద్రబాబు ఇద్దరూ ఒకటేనని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై వైఎస్‌ జగన్‌ ధైర్యంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలవడానికి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. సొంత రాష్ట్ర ప్రజలను రౌడీలుగా చిత్రీకరించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. డబ్బు, పచ్చ మీడియాతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కర్నూలు ఇన్‌చార్జ్ హఫీజ్‌ ఖాన్‌, శివ అన్నపురెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్ ప్రజలతో నిరంతరం మమేకం అవుతున్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ గెలుపు ఖాయమని అన్నారు.  అనంతరం పద్మజ నిరనల్లి మాట్లాడుతూ చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమగ్రతకు, నిజాయితీకి ప్రతిరూపమని చెప్పారు. వైఎస్సార్‌ లాగే వైఎస్‌ జగన్‌ పెద్దలను గౌరవించడంలో ముందుంటారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూలదోయడానికి వైఎస్‌ జగన్‌ అనే బాణాన్ని ఎక్కుపెట్టాలని అన్నారు.

లాయర్‌ పత్రిక ఎడిటర్‌, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక చిన్న పత్రిక ఎడిటర్‌తో వైఎస్‌ఆర్‌  చాలా సమయం గడిపారని, ఏ ఒక్క సీఎం ఇలా మనస్పూర్తిగా ప్రజలకోసం పనిచేయలేదని కితాబిచ్చారు. వైఎస్సార్‌ లాగే వైఎస్‌ జగన్ గొప్ప నాయకుడని అన్నారు. వైఎస్‌ జగన్‌ ఏపీకి మాత్రమే నాయకుడు కాదని, 2024 ఎన్నికల్లో తెలంగాణలో కూడా విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కోన రఘుపతి, పార్టీ సీనియర్‌ నేతలు కారుమూరి నాగేశ్వరరావు, లక్ష్మీపార్వతి, కర్నూలు సమన్వయ కర్త హఫీజ్ ఖాన్‌లతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ వేడుకలను స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రమణారెడ్డి కృష్టపాటి, కృష్ణారెడ్డి కోడూరు, శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి, రమణ పుట్లూరు, మణి అన్నపురెడ్డి, ఉమామహేశ్వర్‌, శ్రీకాంత్‌ రెడ్డి జొన్నాల, సునీల్‌ దేవిరెడ్డి, ఓబుల్‌ రెడ్డి శ్రీనివాస రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top