‘గాంధేయవాద విస్తరణకు ప్రవాసుల కృషి అమోఘం’

Gandhi 150 Jayanthi Celebrations At Texas Headed by MGMNT - Sakshi

అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా

ఇర్వింగ్‌లోని మహాత్ముని స్మారకస్థలం వద్ద 150వ జయంతి వేడుకలు

గాంధీ స్మారకస్థలిని సందర్శించిన తొలి భారత రాయబారి

టెక్సాక్‌ : శాంతి, ప్రేమ, అహింస వంటి ఆశయాల సమాహారమైన గాంధేయవాదానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం కల్పించడంలో విశేష కృషి చేస్తున్న ప్రవాస భారతీయుల చొరవ, కృషి అభినందనీయమని భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా కొనియాడారు. డా. తోటకూర ప్రసాద్ నేతృత్వంలో సోమవారం మధ్యాహ్నం టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్‌లో గల మహాత్మా గాంధీ స్మారకస్థలి వద్ద గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత రాయబారి ష్రింగ్లా మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించి ప్రసంగించారు. తాను దక్షిణాఫ్రికా దేశంలోని డర్బన్ నగరంలో భారత కాన్సుల్ జనరల్‌గా సేవలందించినప్పుడు గాంధీజి గత చరిత్రను అతి సమీపంగా సున్నితంగా స్పృశించానని, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారిని అహింసాయుత పోరాటాల వైపు ప్రేరేపించడం గాంధీయిజానికి పాశ్చాత్య దేశాలు పట్టిన గొడుగు అని ఆయన పేర్కొన్నారు.

150వ జయంతి ఉత్సవాలను అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో సైతం నిర్వహించామని అన్నారు. భారత్‌-అమెరికా మధ్య జీవ వారధులుగా ప్రవాస భారతీయులు వర్థిల్లుతున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యలు నిజం చేసేలా గాంధేయవాదానికి కూడా ప్రవాసులు బ్రహ్మరథం పడుతున్నారని వారందరికీ తన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ గాంధీ స్మారకస్థలిని సందర్శించిన ప్రప్రథమ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా కావడం ఆనందంగా ఉందని, మహాత్మా గాంధీ స్మారకస్థలి ఏర్పాటులో జరిగిన కృషి, స్మారకస్థలి విశేషాలు, స్థానిక పాఠశాల విద్యార్థులకు అది ఎలా ఉపయుక్తమవుతుందనే విషయాలను రాయబారికి వివరించారు. గాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల సభను ప్రారంభించగా, అక్రం సయాద్ తుది పల్కులు పల్కారు. అనంతరం మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా ను ఘనంగా శాలువతో సత్కరించి, స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గాంధీజి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు.

ఏపీ అధికార భాషా సంఘ అధ్యక్షులు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రత్యేక అతిధిగా పాల్గొని బాపూజీ కి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హ్యూస్టన్ భారత కాన్సులేట్ జనరల్ డా. అనుపమ్ రే, కాన్సులేట్ అధికారులు సురేంద్ర అదానా, అశోక్, గాంధీ మెమోరియల్ డైరెక్టర్స్ రావు కల్వల, జాన్ హామేండ్, కమల్ కౌశల్, అక్రం సయాద్, షబ్నం మాడ్గిల్, జాక్ గద్వాని, స్వాతి షా, శాంటే చారి, శ్రీకాంత్ పోలవరపు, మురళీ వెన్నం తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top