మంచం పట్టిన లచ్చాపేట

villagers affected by fever in lachapeta - Sakshi

గ్రామస్తులకు వాంతులు, విరోచనాలు

436 మందికి అస్వస్థత

గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు

గ్రామాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్, కలెక్టర్‌

పరిస్థితిని పర్యవేక్షిస్తున్న డీఎంహెచ్‌వో  

మాచారెడ్డి: మండలంలోని లచ్చాపేట గ్రామంలో ఉన్నట్టుండి వందలాది మం ది అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం నుంచి వాంతులు, విరేచనాలు, విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ప్రజలు ఆదివారంనుంచి వాంతులు,  విరేచనాలు, జ్వరాలతో బాధపడుతున్నారని స్థానికులు తెలిపారు. అయితే కల్తీ కల్లు తాగడం వల్లే ఇలా జరిగి ఉం టుందని భావించారు. రోజురోజుకు జ్వరపీడితులు పెరుగుతుండడంతో ఆందో ళన చెందుతున్నారు. మంగళవారానికి యాభై మంది అస్వస్థతకు గురికాగా.. బుధవారానికి వారి సంఖ్య 436కు చేరింది. దీంతో వైద్యాధికారులు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన 38 మందిని మాచారెడ్డి పీహెచ్‌సీకి, 16 మందిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు.

గ్రామాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్, కలెక్టర్‌
లచ్చాపేటలో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మంగళవారం అర్ధరాత్రి గ్రామాన్ని సందర్శించారు. బాధితులను పరామర్శించిన ఆయన, పరిస్థితి తెలుసుకున్నారు. బుధవారం  కలెక్టర్‌ సత్యనారాయణ, ఐసీడీఎస్‌ పీడీ రాధ మ్మ, ఎక్సైజ్‌ సీఐ ఫణీందర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, తహసీల్దార్‌ శ్యామల గ్రామా న్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. గ్రామంలో పర్యటించి పరిస్థితి తెలుసుకున్నారు. కల్లు, నీటి నమూనాలను సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షల అనంతరం కల్తీకల్లుతోనా, కలుషిత నీటితోనా అన్న విషయం తేలుతుందన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు.

వాంతులు, విరోచనాలు అయ్యాయి
నాకు సోమవారం నుంచి వాంతులు, వీరేచనాలు అవుతున్నాయి. జ్వరం వచ్చింది. దీంతో ప్రైవేట్‌ వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నాను. మళ్లీ మంగళవారం వాంతులు, వీరేచనాలు ఎక్కువయ్యాయి. గ్రామంలోని వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నాను.

– జగన్, బాధితుడు, లచ్చాపేట

పరిస్థితి నిలకడగా ఉంది
లచ్చాపేటలో వాంతులు, వీరేచనాలు, జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. అందరి పరిస్థితి నిలకడగా ఉంది. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి స్థానిక వైద్య శిబిరంలో చికిత్సలు అందిస్తున్నాం. కొంతమందిని మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మరికొందరిని ఏరియా ఆస్పత్రికి తరలించాం. నీటి శాంపిళ్లు సేకరిస్తున్నాం. దేనివల్ల ఇలా అయ్యిందనేది పరీక్షల తర్వాత తెలుస్తుంది.

    – చంద్రశేఖర్, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో 

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top