గిరిజన హాస్టళ్లలో ‘సీసీ’ నిఘా

tribal welfare hostels under cc cameras surveillance - Sakshi

భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం 

నెలాఖరులోగా పూర్తి కానున్న సీసీ కెమెరాల బిగింపు 

ప్రతి హాస్టల్‌కు ఒక కంప్యూటర్, బయోమెట్రిక్‌ మెషిన్‌..

హాస్టళ్లలో అక్రమాలకు అడ్డుకట్ట 

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థుల భద్రతతో పాటు నిఘా పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలను బిగిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని ప్రీమెట్రిక్‌ హాస్టళ్లలో ఏర్పాటు చేస్తుండగా, పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లలో కూడా ఈ నెలాఖరు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో మొత్తం ఎనిమిది హాస్టళ్లు ఉండగా నాలుగు ప్రీ మెట్రిక్, నాలుగు పోస్ట్‌మెట్రిక్‌ హాస్టలున్నాయి. వీటిలో దాదాపు 950కి పైగా మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే విద్యార్థులతో పాటు వార్డెన్, వర్కర్‌ల కదలికలు గమనించడానికి, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడనున్నాయి.

ఇటీవల జిల్లాలో ఎస్సీ హాస్టళ్లలో సన్న బియ్యం తరలింపు వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో సీసీ కెమెరాలే అధికారులకు ఆధా రాలయ్యాయి. ఈ నేపథ్యంలో బియ్యం, సరుకులు పక్కదారి పట్టించినా, లారీల్లోంచి బియ్యం బస్తాల ను లెక్క ప్రకారమే దింపుతున్నారా అనే విషయాలు సీసీ కెమెరాల్లో రికార్డయిన పుటేజీల ద్వారా తెలిసిపోనుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అయితే కిచెన్, స్టోర్‌ రూం, గ్రౌండ్, హాస్టల్‌ ఎంట్రెన్స్‌ ఇలా దాదాపు ఒక్కో హాస్టల్‌లో 7–8 సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుంచి ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లకు సీసీ కెమెరాలు చేరుకోగ, ఈ నెలాఖరులోగా పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లకు కూడా సీసీ కెమెరాలు రానున్నాయి.
 
కంప్యూటర్‌లు, బయోమెట్రిక్‌ విధానం... 
విద్యార్థుల హాజరు శాతాన్ని రోజు వారీగా నమోదు చేసేందుకు ఈ గిరిజన హాస్టళ్లలో బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆన్‌లైన్‌లో హాజరు శాతాన్ని నమోదు చేసి వార్డెన్‌లు అధికారుల కు పంపాల్సి ఉంటుంది. తద్వారా విద్యార్థుల రాకు న్నా వారి పేరిట రేషన్‌ను డ్రా చేసేందుకు వీలుపడదు. దీంతో అక్రమాలను అడ్డుకట్ట పడనుంది. అలాగే కంప్యూటర్‌లను కూడా ప్రతీ హాస్టల్‌కు సరఫరా కానున్నాయి. బయోమెట్రిక్‌ను కంప్యూటర్‌కు అనుసంధానం చేయడంతో పాలు బిల్లులను తయా రు చేయడానికి ఉపయోగపడనున్నాయి. కంప్యూటర్‌లను కూడా రాష్ట్ర శాఖనే సరఫరా చేయనుంది.
 
పారదర్శకత ఏర్పడుతుంది.. 
గిరిజన సంక్షేమ హాస్టళ్లలో సీసీ కెమెరాలతో కంప్యూటర్‌లు, బయోమెట్రిక్‌ మెషిన్‌లు ఏర్పాటు కానున్నాయి. హాస్టళ్లకు భద్రతతో పాటు నిఘా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న పై నిర్ణయాల వల్ల హాస్టళ్లలో పారదర్శకత ఏర్పడుతుంది.  
– సంధ్యారాణి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి 

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top