
‘ఆర్టికల్ 3’పై చర్చిద్దాం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ విభజనకు పాల్పడుతున్న కేంద్రం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందంటూ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు లోక్‌సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది.
లోక్‌సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒత్తిడి
వెల్‌లోకి వెళ్లి పట్టుబట్టిన జగన్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ విభజనకు పాల్పడుతున్న కేంద్రం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందంటూ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు లోక్‌సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పోడియం వద్దకు వెళ్లి, వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టేలా చూసేందుకు ఆందోళన సాగించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి ఆయనతో పాటు పోడియం వద్దకు చేరుకుని ‘కీప్ ఆంధ్రప్రదేశ్ యునెటైడ్’ (ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచండి) అనే నినాదం రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. సభ జరిగిన మూడుసార్లూ, ఈ ముగ్గురు నేతలూ ఇదే తరహాలో ఒత్తిడి తెచ్చారు. సమైక్యాంధ్ర, లోక్‌పాల్ బిల్లు తదితర అంశాలపై వివిధ పార్టీలు ఉభయ సభల్లోనూ పెద్దపెట్టున ప్రభుత్వంపై విరచుకుపడటంతో వరుసగా ఐదోరోజూ వాయిదాల పరంపరే కొనసాగింది.
లోక్‌సభలో ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్, పన్నెండేళ్ల కిందట పార్లమెంటుపై జరిగిన దాడిలో అమరులైన వారికి, ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు నివాళులర్పించేందుకు సంతాప ప్రకటన చదివారు. సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించి వారికి నివాళులర్పించారు. తర్వాత ప్రశ్నోత్తరాలను చేపట్టబోతుండగా, విపక్ష నేత సుష్మా స్వరాజ్ లేచి, ప్రశ్నోత్తరాల సస్పెన్షన్‌కు తమ పార్టీ ఇచ్చిన నోటీసును ప్రస్తావించారు. లైంగిక వేధింపుల కేసులో జస్టిస్ గంగూలీ తీరును తప్పుపడుతూ ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడుతుండగానే, టీడీపీ సభ్యులు ముగ్గురు, ఇతర పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు ప్రారంభించారు. ఈలోగా వాయిదా తీర్మానంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్, మేకపాటి, ఎస్పీవై పోడియం వద్దకు వెళ్లారు. సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే సుష్మా తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. అప్పటికి ఇతర పార్టీల సభ్యులూ వెల్‌లోకి వచ్చారు. సుష్మా తర్వాత మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ జస్టిస్ గంగూలీ విషయంలో తాను సుష్మా అభిప్రాయాలను సమర్థిస్తున్నాన్నారు. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ యూపీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు నిరసనలు కొనసాగుతుండగానే మంత్రులు బొగ్గు నియంత్రణాధికా సంస్థ బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ దశలో జగన్, మేకపాటి, ఎస్పీవై రెండోసారి పోడియం వద్దకు వెళ్లి ఆందోళన సాగించారు. అదే సమయంలో స్పీకర్ అవిశ్వాస తీర్మాన నోటీసులను ప్రస్తావించారు. మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కొనకళ్ల నారాయణరావు, ఇతరులు; ఆర్.సాంబశివరావు, ఇతరులు; వైఎస్ జగన్మోహనరెడ్డి, ఇతరుల నుంచి తనకు మూడు నోటీసులు అందినట్లు చెప్పారు. సభ సాధారణ స్థితిలో లేకుంటే, తమ తమ స్థానాల్లో లేచి నిలబడే సభ్యులను లెక్కించలేనని, నిబంధనల ప్రకారం 50 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లుగా సరిచూసుకోనిదే నోటీసులకు అనుమతించలేనని చెప్పారు. అందువల్ల సభ్యులంతా తమ తమ స్థానాలకు వెళ్లాల్సిందిగా స్పీకర్ విజ్ఞప్తి చేసినా, ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మూడోసారి సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా జగన్, మేకపాటి, ఎస్పీవై పోడియం వద్దకు వెళ్లి ఆందోళన సాగించారు. స్పీకర్ మరోసారి అవిశ్వాస నోటీసులను ప్రస్తావించి, సభ్యులంతా తమ తమ స్థానాలకు వెళ్లాలని కోరినా, సభ్యులెవరూ శాంతించలేదు. దీంతో ఆమె సభను సోమవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభ ముందుకు లోక్‌పాల్ బిల్లు
లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభ ముందుకు తెచ్చింది. గత డిసెంబర్‌లో బిల్లును ప్రవేశపెట్టినా, ఆమోదానికి నోచుకోకపోవడంతో, సవరణ బిల్లును తెచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ దీనిని వ్యతిరేకించడంతో చర్చకు అవకాశం లేకుండాపోయింది. సభ సమావేశం కాగానే మంత్రి నారాయణసామి లోక్‌పాల్, లోకాయుక్త-2011 సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై ఆయన మాట్లాడుతుండగానే, ప్రస్తుత రూపంలో దానిని ఆమోదిస్తే పోలీసు రాజ్యానికి దారితీస్తుందని ఎస్పీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకంటే ముందు ధరల సమస్యపై చర్చించాలని పట్టుబట్టారు. సభను రెండుసార్లు వాయిదా వేసినా, పరిస్థితి సద్దుమణగకపోవడంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, లోక్‌పాల్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. ప్రస్తుత సమావేశాల్లోనే దీనిని ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. రాజ్యసభ ఉదయం 11 గంటలకు మొదలవగానే, సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ పార్లమెంటుపై దాడిలో అమరులైన వారికి నివాళుల ప్రకటన చేశారు. అనంతరం ఇటీవల ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించిన సచిన్ టెండూల్కర్‌కు అభినందనల అంశాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడటం పూర్తవగానే వివిధ పార్టీల సభ్యులు తాము లేవనెత్తిన అంశాలపై ప్రశ్నలు సంధించడంతో గందరగోళం నెలకొంది. రెండుసార్లు సభను వాయిదా వేసినా, పరిస్థితి చక్కబడలేదు. లోక్‌సభ బిల్లులోని అంశాలను మంత్రి నారాయణసామి చదివే ప్రయత్నం చేయగా, ఎస్పీ సభ్యుడు నరేశ్ అగ్రవాల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ దీనిని తోసిపుచ్చి, బిల్లును ప్రతిపాదించాలని నారాయణసామిని కోరారు. ఆయన మళ్లీ బిల్లులోని అంశాలను చదవబోతుండగా సభలో నినాదాలు హోరెత్తాయి. దీంతో కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
అమరులకు జగన్ నివాళులు
పార్లమెంటుపై దాడి సంఘటనలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్‌తో పాటు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అమరుల చిత్రపటాల ముందు మౌనం పాటించి నివాళులర్పించారు.
అవిశ్వాసానికి మద్దతిస్తామన్న ఎస్పీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ శుక్రవారం ప్రకటించింది. యూపీఏ సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ, లోక్‌పాల్ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తోంది. తమతో సంప్రదించకుండానే లోక్‌పాల్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడంపై ఆగ్రహంతో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, అవిశ్వాసానికి అనుకూలంగా తన వైఖరిని మార్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోక్‌పాల్ బిల్లు, ‘అవిశ్వాసం’... ఈ రెండింటిలో దేనికి సిద్ధపడతారో తేల్చుకోవాలంటూ సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసినట్లు పలు చానళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి. తెలంగాణ విషయమై కేంద్రంపై అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే, తాము దానిని సమర్థిస్తామని ఎస్పీ నేత రామ్‌గోపాల్ చెప్పారు. అయితే, అవిశ్వాస తీర్మానంపై నోటీసులను సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అనుమతి లభించాలంటే కనీసం 55 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. ఈ నోటీసులపై ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, ముగ్గురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీలు, టీడీపీ ఎంపీలతో కలుపుకొని 13 మంది మాత్రమే సంతకాలు చేశారు. లోక్‌సభలో శుక్రవారం వరుసగా ఐదోరోజూ వివిధ అంశాలపై విపక్షాలు రభసకు దిగడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.