అందరికీ ఆరోగ్యం.. అదే మా నినాదం

World Health Day 2019 Universal Health Coverage - Sakshi

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతి ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పడిన రోజునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1948లో జెనీవాలో తొలిసారిగా జరిగిన డబ్ల్యూహెచ్‌ఓ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 2019 సంవత్సరంతో డబ్ల్యూహెచ్‌ఓ 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరానికి గాను ‘అందరికీ ఆరోగ్య రక్షణ’ అనే నినాదాన్ని ఇచ్చింది. 

‘కుల, మత, జాతి, ప్రాంత, ఆర్థిక తేడాలు లేకుండా అందరికీ ఒకే విదమైన ఆరోగ్య రక్షణ, నాణ్యమైన సేవలు అందించడం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనం గెహెబ్రేస్స్ తెలిపారు. ఆయన ఆదివారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో తమ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెడ్రోస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో అనేక దేశాల్లో ప్రభలుతున్న వ్యాధులను, అనారోగ్యం వల్ల సంభవించే మరణాలను నిర్మూలించేందుకు తమ సంస్థ చాలా  కృషి చేస్తోందని, అయినప్పటికీ ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికి కూడా ప్రపంచంలో సగం జనాభాకు తగిన వైద్యం అందడం లేదని, కొన్ని దేశాల్లో కనీస వైద్య సౌకర్యాలు లేక గర్భిణీ మహిళలు అవస్థలు పడుతున్నారని,  చాలా మంది పిల్లలకు రోగనిరోధక టీకాలు కూడా అందడం లేదని టెడ్రోస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని దేశాల ప్రజలకు సరైన సమయంలో వైద్యం అందక హెచ్‌ఐవీ, టీబీ, మలేరియా బారిన పడి చనిపోతున్నారని, 2019 సంవత్సరంతో ఇవన్నీ ఆగిపోవాలని కోరుకుంటున్నాట్లు తెలిపారు. పేద వారికి కూడు, గూడు, గుడ్డతో పాటు ఆరోగ్యం కూడా కనీస సదుపాయంగా కల్పించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశ్యమని, అందుకే 2019లో ‘అందరికి ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరికి, ప్రతి చోటుకు’ అనే నినాదంతో ప్రజలందరికి ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top