వైరల్‌ ఫోటో..వాస్తవం తెలుసుకుని రాయండి

Woman reacted on class discrimination Criticism in Delhi Metro - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో గత రెండు రోజులుగా ఓ ఫోటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ మెట్రో రైలులో ఓ మహిళ తన బిడ్డతో సీట్లో కూర్చుని.. పని మనిషిని మాత్రం కింద కూర్చోబెట్టింది. ఓ యువ జర్నలిస్ట్‌ ఈ ఫోటోను తీసి సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేయగా... సదరు మహిళపై తీవ్ర విమర్శలు వినిపించాయి. 

ది ప్రింట్‌ ఇండియా రిపోర్టర్‌ సన్య ధింగ్రా శనివారం సాయంత్రం మెట్రో రైల్‌లో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో ఓ మహిళ తన చిన్నారితో సీట్‌లో కూర్చొని ఉన్నారు. అయితే చిన్నారి బాగోగులు చూసుకునే ఆయా మాత్రం కిందే కూర్చుని ఉన్నారు. పక్కనే కాస్త జాగా ఉన్నప్పటికీ ఎవరూ ఆమెకు చోటు ఇవ్వలేదు. చివరకు యాజమాని అయిన మహిళ కూడా ఆమెను కూర్చొమని కోరలేదు. ఎలా ఉందో చూడండంటూ ఆ ఫోటోను  సన్య తన ట్వీటర్‌లో పోస్టు చేశారు. ఇది ఇంతటితో ఆగలేదు. 

ది ప్రింట్‌ ఇండియా సోమవారం సంచికలో దీనిని ముఖచిత్రంగా ప్రచురించింది. విమర్శల నేపథ్యంలో చివరకు ఆ మహిళ తన బ్లాగ్‌లో స్పందించారు. తాను అపోలో ఆస్పత్రిలో పని చేసే వైద్యురాలినినని పేర్కొంటూ 8 పేరాలతో ఓ పెద్ద వ్యాసాన్నే ప్రచురించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెబుతూ మొత్తం వివరించారు. ‘‘నేను-నా బిడ్డ-ఆయా ముగ్గురం మెట్రోలో ఇంటికి బయలుదేరాం. మా దగ్గర లగేజీ చాలా ఉంది. మేం రైలు ఎక్కిన సమయంలో ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది. మహిళలంతా కిందే కూర్చుని ఉన్నారు. ఇది మాకు కొత్తేం కాదు. నా బిడ్డను నేను, ఆయా ఇద్దరం కలిసి ఆడించాం. తర్వాత కాసేపటికి మేమున్న కోచ్‌ కాస్త ఖాళీ అయ్యింది. ఓ మహిళ నాకు సీటు ఇచ్చి దిగిపోయారు. వెంటనే నేను, నా చిన్నారి ఆ సీట్‌లో కూర్చున్నాం. అప్పుడే సన్య మా కోచ్‌లోకి ఎక్కారు. అయితే అప్పటికే బాగా అలిసిపోయిన ఆయా కింద కూర్చోవటం గమనించిన సన్య.. ఆమెను పైన కూర్చొమని కోరారు. కానీ, తనకు కింద కూర్చోవటమే బాగుందని ఆయా బదులిచ్చింది.. చివరకు ఎంజీ రోడ్‌ స్టేషన్‌లో దిగి మేం ఇంటికి వెళ్లిపోయాం. 


సోషల్‌ మీడియాపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. ఎవరో చెప్పగా నేను ఆ పోస్టును చూశాను. నేనొక వైద్యురాలిని ప్రజలకు సేవ చేయటం నా కర్తవ్యం. ఆమె మా ఇంట్లో పని మనిషిగా చాలా రోజుల నుంచి చేస్తోంది. మాతోనే ఉంటుంది. మాతోనే తింటుంది. తోటి మనిషితో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. ఆత్రుతతో అనుమతి లేకుండా సన్య నా ఫోటో తీయటం.. వాస్తవాలు ఏంటో తెలీకుండా శేఖర్‌ గుప్తా(ప్రముఖ జర్నలిస్ట్‌) కథనం రాయటం... సరికాదు. అంటూ సదరు మహిళ ఆ కథనంపై మండిపడ్డారు.

సన్య చేసిన పోస్టు ఇదే!
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top