 
															షూలో కెమెరా పెట్టి...
ఢిల్లీలోని ఓ షాపింగ్ పాల్లో కార్పొరేట్ న్యాయవాది ఒకడు దొంగచాటుగా అమ్మాయిల ఫోటోలు తీస్తున్న వైనం పలువురిని కలవరానికి గురి చేసింది. షాపింగ్ మాల్ సిబ్బంది అప్రమత్తతతో అతని ఆట కట్టయింది.
	న్యూఢిల్లీ:   దేశ రాజధానిలోని  ఓ  షాపింగ్ మాల్లో  దొంగచాటుగా అమ్మాయిల అసభ్య ఫోటోలు తీస్తూ ఓ న్యాయవాది అడ్డంగా దొరికిపోయాడు.    షాపింగ్ మాల్  సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించటంతో అతడి ఆట కట్టయింది. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది.
	
	వివరాల్లోకి వెళితే  దక్షిణ ఢిల్లీలోకి షాపింగ్ మాల్కి వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పద ప్రవర్తనపై షాపింగ్ మాల్  మేనేజర్కు సందేహం వచ్చింది.   అతడు...అమ్మాయిలు, మహిళలు వెనకే అనుమానాస్పదంగా సంచరించడాన్ని గమనించాడు. దీంతో అతగాడిని మేనేజర్ వారించి ప్రశ్నించగా పారిపోయేందుకు  ప్రయత్నించాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు.  అతడిని సోదా చేయగా,  షూలో  దాచి పెట్టిన రహస్య కెమెరా బటయపడింది. ఆ రహస్య కెమెరాతోనే అమ్మాయిల అసభ్య ఫోటోలు తీసినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
	
	నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర్నించి  సెల్ఫోన్, ల్యాప్టాప్ను  స్వాధీనం చేసుకున్నారు.  దీంతో అసభ్య ఫోటోలతో కూడి 12 క్లిప్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ దృశ్యాలను...నిందితుడు ఇంటర్నెట్లో  అప్లోడ్ చేశాడా లేదా అనేది  పరిశీలించాల్సి ఉందని  అధికారులు పేర్కొన్నారు. నిందితుడు హర్యానాకు చెందిన వినియోగదారుల ఫోరం  మాజీ అధ్యక్షుడి  కుమారుడని తెలిపారు.
	
	పోలీసుల విచారణలో ఆ వ్యక్తి...న్యాయవాదిగా గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా...  అతగాడు నేరాన్ని అంగీకరించాడు. తన కుడికాలి బూటులో  రహస్య కెమెరా అమర్చుకున్నట్టు తెలిపాడు. గత కొన్ని రోజులుగా తరచూ షాపింగ్ మాల్కు వచ్చి  అమ్మాయిలను ఫోటోలను తీస్తున్నట్లు ఒప్పుకున్నాడు.  ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ద్వారా తనకు ఈ ఐడియా వచ్చిందని, ఆన్లైన్ ద్వారా స్పై కెమెరాను కొనుగోలు చేసినట్టు  నిందితుడు అంగీకరించాడు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
