తదుపరి నేవీ చీఫ్‌గా కరమ్‌బీర్‌

Vice Admiral Karambir Singh appointed next Navy Chief  - Sakshi

న్యూఢిల్లీ: నావికాదళం తదుపరి అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ను కేంద్రం నియమించింది. మే 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఛీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లాంబా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. విశాఖలోని ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌లో ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్‌(ఎఫ్‌వోసీ–ఇన్‌– సీ)గా ఉన్న కరమ్‌బీర్‌ మే 31వ తేదీన విధుల్లో చేరుతారని పేర్కొంది. హెలికాప్టర్‌ పైలెట్‌ ఒకరు నేవీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే ప్రథమం. అత్యంత సీనియర్‌ అధికారిని ఈ పదవికి నియమించాలన్న సంప్రదాయ విధానాన్ని పక్కనబెట్టి ప్రతిభే గీటురాయిగా కరమ్‌బీర్‌ను ఎంపిక చేసినట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది.

కరమ్‌బీర్‌ గురించి ఇంకొంత
స్వస్థలం: పంజాబ్‌లోని జలంధర్‌ ∙పుట్టిన తేదీ: నవంబర్‌ 3, 1959
నేవీలో చేరింది: జూలై 1, 1980 హెలికాప్టర్‌ పైలెట్‌గా ఎంపిక: 1982
శిక్షణ: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (పూణె), డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌(వెల్లింగ్టన్‌), చేతక్, కమోవ్‌ హెలీకాప్టర్ల పైలెట్‌గా విశేష అనుభవం.
అనుభవం: 37 ఏళ్ల సర్వీసులో కరమ్‌బీర్‌ సింగ్‌ ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ షిప్‌ చాంద్‌బీబీ, మిసైల్‌ కార్వెట్‌ ఐఎన్‌ఎస్‌ విజయ్‌దుర్గ్, గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్స్‌ ఐఎన్‌ఎస్‌ రాణా నౌకలకు కమాండర్‌గా పనిచేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top