రోడ్డు ప్రమాదాలకు ‘లైసెన్స్‌’

Valid Driving License Holders Caused For Road Accidents In India - Sakshi

80శాతం ప్రమాదాలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న వాళ్ల వల్లే...

తాజా అధ్యయనంలో వెల్లడి

దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్ష మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం, రోడ్డు నిబంధనలు, డ్రైవింగ్‌ నియమాలు తెలియకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అందరూ భావిస్తుంటారు. అయితే, గతేడాది (2017) జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం ప్రమాదాలకు కారకులు డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న వారేనని తాజా అధ్యయనంలో తేలింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 2019 నుంచి దేశ వ్యాప్తంగా ఒకే విధమైన డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయితే,  డ్రైవింగ్‌ లైసెన్సు నిబంధనలను కచ్చితంగా పాటించడం, ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థను నిర్మూలించడం జరగకపోతే ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదని సేవ్‌లైవ్‌ ఫౌండేషన్‌ సీఈవో పీయూష్‌ తివారి హెచ్చరించారు. చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా అనర్హులు కూడా డ్రైవింగ్‌ లైసెన్సులు ‘కొనేస్తున్నార’ని ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా సర్వే ప్రకారం...
2017లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80శాతం ప్రమాదాలకు డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న వారే కారణం.
దేశంలో డ్రైవింగ్‌ లైసెన్సు పొందిన వారిలో 59శాతం మంది ఒక్క పరీక్షకు కూడా హాజరు కాలేదు.
దేశంలో 25 శాతం మందికి ఒకటి కంటే ఎక్కువ డ్రైవింగ్‌ లైసెన్సులు ఉన్నాయి.
డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న వారిలో రోడ్డు నిబంధనలు తెలిసిన వారు 12 శాతం కంటే తక్కువే.

చాలామంది ఎలాంటి పరీక్షలకు హాజరు కాకుండానే దళారులకు 3,4 వేలు చెల్లించి డ్రైవింగ్‌ లైసెన్సు పొందుతున్నారనీ, అలాంటి వారి చేతిలో వాహనం పిచ్చివాడి చేతిలో రాయిలా మారుతుందని పీయూష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవింగ్‌ లైసెన్సు నిబంధనలను కచ్చితంగా అమలు పరచాలని ఇందుకోసం పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలో లైసెన్స్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో వాహనాల ఫిట్‌నెస్‌ను పరీక్షించడానికి ఆటోమేటిక్‌ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారని, డ్రైవింగ్‌ లైసెన్సు పరీక్షలకు కూడా ఇలాంటి యంత్రాలను ఏర్పాటు చేస్తే లోపాలకు ఆస్కారం ఉండదని ఆయన అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top