భద్రతా వలయంలో ఢిల్లీ | Unprecedented security for US President Barack Obama's Delhi visit | Sakshi
Sakshi News home page

భద్రతా వలయంలో ఢిల్లీ

Jan 25 2015 4:48 AM | Updated on Sep 2 2017 8:12 PM

భద్రతా వలయంలో ఢిల్లీ

భద్రతా వలయంలో ఢిల్లీ

వెయ్యికి పైగా ఎన్‌ఎస్‌జీ కమాండోలు.. 44 వేల మంది భద్రతా సిబ్బంది.. వీరికి తోడు అమెరికాకు చెందిన మరో 1,600 మంది మెరికల్లాంటి రక్షణ సిబ్బంది..

న్యూఢిల్లీ: వెయ్యికి పైగా ఎన్‌ఎస్‌జీ కమాండోలు.. 44 వేల మంది భద్రతా సిబ్బంది.. వీరికి తోడు అమెరికాకు చెందిన మరో 1,600 మంది మెరికల్లాంటి రక్షణ సిబ్బంది.. 15 వేల సీసీటీవీ కెమెరాలు..! ఒబామా పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో చేసిన భద్రతా ఏర్పాట్లు ఇవీ!! గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని పూర్తిగా భద్రతా బలగాల గుప్పెట్లోకి వెళ్లనుంది. వేడుకలు జరగనున్న రాజ్‌పథ్‌కు రెండు కిలోమీటర్ల ప్రాంతమంతా వెయ్యి మంది ఎన్‌ఎస్‌జీ గార్డుల సంరక్షణలో ఉండనుంది.

ఎత్తై భవనాలపై  నుంచి వీరు డేగకన్నులతో క్షణక్షణం అప్రమత్తంగా ఉంటారు. రాజ్‌పథ్ వద్ద ఏడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 44 వేల మంది పోలీసులు ఉదయం 5 గంటల నుంచే రాజధాని వీధుల్లో గస్తీ నిర్వహిస్తారు. ఈ 44 వేల మందిలో 10 వేల మంది పారామిలటరీ సిబ్బంది కాగా, 30 వేల మంది ఢిల్లీ పోలీసులు. సెంట్రల్, నార్త్, న్యూఢిల్లీ.. ఈ మూడు జిల్లాల్లోనే ఏకంగా 20 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు.
 
 ఒబామా ఢిల్లీలో అడుగుపెట్టనున్న ఆదివారం రోజున 20 వేల మంది గస్తీ నిర్వహిస్తారు. ఢిల్లీ వ్యాప్తంగా 15 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్ మార్గంపై 18 మీటర్లకు ఒకటి చొప్పున 160 కెమెరాలను ఏర్పాటు చేశారు. వేడుకల్లో తొలిసారిగా గగ నతల హెచ్చరిక వ్యవస్థ (అవాక్స్) కూడా వినియోగించే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. ఢిల్లీ గగనతలంపై 400 కిలోమీటర్ల పరిధిని నోఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఇంతకుముందు దీన్ని 300 కి.మీగా నిర్ధారించారు. ఈ పెంపుతో వేడుకలు జరుగుతున్నంత సేపు ఢిల్లీ, జైపూర్, ఆగ్రా, లక్నో, అమృత్‌సర్  తదితర ఎయిర్‌పోర్టుల్లో విమానాలు ఎగరడానికి వీలుండదు. ఢిల్లీలో ఒబామా విమానం దిగగానే ఆ ప్రాంతాన్ని ఎన్‌ఎస్‌జీ, అమెరికా నిఘా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకోనున్నారు. ఆయన బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్ వద్ద కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చే స్తున్నారు. భద్రతా కారణాల రీత్యా 26న కొన్ని ప్రాంతాలకు తాత్కాలికంగా మెట్రోరైలు సేవలు నిలిపివేయనున్నారు.
 
 చొరబాటుకోసం పొంచి ఉన్న 160 మంది మిలిటెంట్లు
 శ్రీనగర్: పాకిస్తాన్‌నుంచి భారత్‌లోకి చొరబడేందుకోసం సుమారు 160 మంది మిలిటెంట్లు సరిహద్దుల్లో పొంచి ఉన్నారని భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ సుబ్రత షా తెలిపారు. కశ్మీర్ లో సరిహద్దుల్లోని అధీనరేఖవెంట 17 చోట్లనుంచి చొరబాటుకోసం వీరు సిద్ధంగా ఉన్నారని  చెప్పారు. ఒబామా పర్యటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
 
  27 రాత్రి 8కి మోదీ, ఒబామాల ‘మన్ కీ బాత్’
 న్యూఢిల్లీ: ఒబామాతో కలిసి భారత ప్రధాని మోదీ చేయనున్న ప్రతిష్టాత్మక రే డియో ప్రోగ్రాం ‘మన్ కీ బాత్’ జనవరి 27న రాత్రి 8 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం కానుంది. ప్రాంతీయ భాషల్లో జనవరి 28 ఉదయం 9 గంటలకు తిరిగి ప్రసారం అవుతుంది.  ఈ ప్రసారాల ఫీడును ఆల్ ఇండియా రేడియో, డీడీలు ఉచితంగా ఇస్తుండటంతో అన్ని రేడియో, టీవీ చానళ్లు ప్రసారం చేసే అవకాశం ఉంది. కాగా, దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఒబామా ముందు సాంస్కృతిక వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చే సింది. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో ఒబామా ముందు వీటిని నిర్వహించనున్నారు.  
 
  ఒబామాకు వాయుకాలుష్యం సెగ!
 న్యూఢిల్లీ: బరాక్ ఒబామా సందర్శించనున్న ఢిల్లీలోని ఆరు ప్రాంతాల్లో వాయుకాలుష్యం ప్రమాదరక స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. అది భారత భద్రతా ప్రమాణాలకంటే మూడు రెట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉందని గ్రీన్‌పీస్ ఇండియా శుక్రవారం జరిపిన ‘పీఎం2.5’ పరీక్షల్లో తేలింది. ఒబామా సందర్శించనున్న జనపథ్‌లో 2.5 మైక్రోమీటర్లకంటే తక్కువ ఉన్న రేణువుల(పీఎం2.5) గరిష్ట స్థాయి క్యూబిక్ మీటరుకు 264 మైక్రోగ్రాములు, హైదరాబాద్ హౌస్ వద్ద 239, రాజ్‌ఘాట్ వద్ద 229 మైక్రోగ్రాములుగా నమోదైందని గ్రీన్‌పీస్ ఇండియా తెలిపింది. పీఎం2.5 రేణువుల కారణంగా కేన్సర్ వంటి తీవ్రమైన జబ్బులు వస్తాయి.
 
  ‘భోపాల్ దుర్ఘటనపై మాట్లాడాలి’
 వాషింగ్టన్: భారత పర్యటనలో ఒబామా భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై మాట్లాడాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది. ఈ ఘటనలో వేలాది మంది చనిపోయారని, ఇప్పటికీ వేల మంది దాని దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ అంశంపై ఒబామా మాట్లాడనట్లయితే అమెరికా కంపెనీలు మానవ హక్కులను పట్టించుకోనక్కర్లేదన్న సంకేతం ఇచ్చినట్లేనని తెలిపింది. భోపాల్ ఘటనపై భారత కోర్టుల సమన్లను అమెరికాకు చెందిన డౌ కెమికల్ కంపెనీ ఎందుకు పట్టించుకోలేదో ఒబామా వివరణ ఇవ్వాలంది. కాగా భారత్‌లో క్షీణిస్తున్న మైనారిటీల హక్కులను మోదీతో జరిపే చర్చల్లో లేవనెత్తాలని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఒబామాను కోరింది.
 
  పర్యటనను నిరసిస్తూ లెఫ్ట్ ధర్నా
 సాక్షి,న్యూఢిల్లీ: ఒబామా భారత పర్యటనకు వ్యతిరేకంగా వామపక్షాలు శనివారం ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.  ఢిల్లీలో మండీహౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకు లెఫ్ట్ నేతలు, కార్యకర్తలు  ర్యాలీగా వచ్చారు. అమెరికాతో సంబంధాలు దేశానికి ముప్పుతెస్తాయన్నారు. సీపీఎం నేత ప్రకాశ్ కారత్, సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులు ధర్నాలో మపాల్గొన్నారు.  దేశ ఆర్థిక విధానాలు మార్చేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కాగా, కేంద్రం ఆదివాసీల సంక్షేమాన్ని పట్టించుకోనందుకు నిరసనగా రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరిస్తున్నట్లు అఖిల భారత ఆదివాసీ మహాసభ తెలిపింది.
 
  అప్పట్లో క్లింటన్‌కూ ఆహ్వానం!
 న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారైనా భారత్ ఈ ఆహ్వానం పంపడం మాత్రం మొదటిసారి కాదు. 1994లో పీవీ నరసింహారావు హయాంలో గణతంత్ర దినోత్సవానికి రావాల్సిందిగా నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు భారత్ ఆహ్వానం పంపింది. అయితే అమెరికా ఉభయ చట్టసభలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉన్నందున ఆయన రాలేకపోయారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కె.శ్రీనివాసన్ వెల్లడించారు. ‘1994 మేలో అమెరికా వెళ్లిన పీవీ.. ఆ దేశాధ్యక్షుడి ఆతిథ్యానికి ముగ్ధుడయ్యారు. భారత్ వచ్చిన తర్వాత.. గణతంత్ర దినోత్సవానికి ఆయనకు ఆహ్వానం పంపాల్సిందిగా నాకు చెప్పారు’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement