సామ్నా ఎడిటర్‌గా రశ్మి ఠాక్రే

Uddhav Thackeray Wife Rashmi Thackeray Is New Editor Of The Saamana - Sakshi

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రశ్మి ఠాక్రే కీలక బాధ్యతలు చేపట్టారు. శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా ఆమె నియమితులయ్యారు. ఆదివారం వెలువడిన సామ్నా పేపర్‌లో రశ్మిని ఎడిటర్‌గా పేర్కొన్నారు . సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ రశ్మినే కావడం విశేషం. కాగా, ఉద్ధవ్‌ రాజకీయాల్లో రాణించడానికి రశ్మి పాత్ర కూడా ఉందని ఆయన సన్నిహితులు చెబుతారు. మహా అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి తమ కుమారుడు ఆదిత్య ఠాక్రేని గెలిపించుకోవడంలో ఉద్ధవ్‌ కంటే కూడా రశ్మినే కీలక పాత్రను పోషించారు. 

1989 డిసెంబర్‌ 13న రశ్మి, ఉద్ధవ్‌ల పెళ్లి జరిగింది. బాల్‌ ఠాక్రే ఉన్నంతకాలం ఆయనకు, పార్టీకీ అండగా ఉన్నారు రశ్మి. బాల్‌ ఠాక్రే జబ్బన పడినప్పుడు ఆయన్ని చూడ్డానికి వచ్చే శివసైనికులకు భోజనం పెట్టకుండా పంపించలేదు రశ్మి! ఠాక్రే వార్థక్యంలో శివసేనకు వారసుడెవరన్న ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్న అప్పటికి ఆరేళ్ల ముందరే తలెత్తింది. ఉద్ధవ్‌కి రాజకీయాలంటే ఆసక్తి లేదు. రాజ్‌కి రాజకీయాలు తప్ప వేరే ఆసక్తి లేదు. పెద్దయాన తల కూడా రాజ్‌ వైపే తిరిగింది. సరిగ్గా ఆ సమయంలో రశ్మి రంగంలోకి దిగారు. మామగారిని, భర్తను ఒప్పించి పార్టీ ఇల్లుదాటిపోకుండా చేయగలిగారు.

మరోవైపు  శివసేన సీనియర్‌ నాయకులు, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ యథావిథిగా సామ్నా కార్యనిర్వహక ఎడిటర్‌గా కొనసాగనున్నారు. మహారాష్ట్రలో శివసేన వాయిస్‌ వినిపించాలనే లక్ష్యంతో ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే ఈ పత్రికను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. (పులి వెనుక పవర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top