రిజర్వేషన్లపై అధికారం మాకే అప్పగించండి  | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై అధికారం మాకే అప్పగించండి 

Published Wed, Jan 9 2019 3:15 AM

TRS MP Jitender Reddy Comments Over Reservations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్లను పెంచుకునే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆర్థిక వెనకబాటు రిజర్వేషన్ల బిల్లుపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఈ బిల్లును టీఆర్‌ఎస్‌ స్వాగతిస్తోంది. సమాజం సమ్మిళితంగా, బలోపేతంగా ఉండేలా చేసే అన్ని మార్గాలను మేం స్వాగతిస్తాం. ఈ బిల్లుద్వారా ఆర్థికంగా వెనకబాటుకు గురైన వారికి మేలు జరుగుతుంది. కులప్రాతిపదికన వెనకబాటు తనం, ఆర్థిక వెనకబాటు తనం రెండూ వేరువేరని ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం చెబుతోంది.

ఆర్థికంగా వెనకబాటు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? స్వతంత్ర భారతంలో కూడా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవడం, సాగునీరు, విద్యుత్తు, వ్యవసాయ సాయం కల్పించకపోవడం వల్ల ఆర్థిక వెనకబాటుతనం ఏర్పడింది. అది కాంగ్రెస్‌ పార్టీ కావొచ్చు.. బీజేపీ కావొచ్చు. పాలనలో ఎవరున్నా.. సగటు మనిషి గురించి ఆలోచించకుండా పైచేయి కోసమే ప్రయత్నించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఆర్థిక వెనకబాటు తనం అనే పదం వెలుగులోకి వచ్చింది. రిజర్వేషన్లు లభించక, మౌలిక వసతులు సమకూరక కొన్ని వర్గాలు ఆర్థికంగా వెనుకబాటుకు గురయ్యాయి.

ఏపీ విభజన అనంతరం తెలంగాణలో సామాజిక సమీకరణాలు మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలు 8% ఉండగా.. ప్రత్యేక రాష్ట్రంలో 12 శాతంగా ఉన్నారు. ఎస్టీలు ఉమ్మడి రాష్ట్రంలో 6% ఉండగా.. తెలంగాణ ఏర్పాటయ్యాక వారి సంఖ్య 10%కు పెరిగింది. ఈ మార్పుల వల్ల తెలంగాణ సర్కారు 2017లో ముస్లింలకు 12%, గిరిజనులకు 10% రిజర్వేషన్లు పెంచుతూ చట్టం తెచ్చింది. దీన్ని కేంద్రం వ్యతిరేకిస్తోంది. మరోసారి కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకొస్తున్నాం. దేశంలో ఒకే చట్టం ఉండాలి. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. షెడ్యూలు 9లో ఈ అంశాన్ని చేర్చారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకే కట్టబెట్టాలి. జనాభా దామాషా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది.

అందువల్లే ఈ డిమాండ్‌ కోసం మేం పార్లమెంటులో పోరాటం చేశాం. కేంద్రం వద్ద ఈ అధికారాన్ని పెట్టుకుంటే రాష్ట్రాల్లోని జనాభా దామాషా మేరకు వారికి న్యాయం జరగదు. ఈ బిల్లును స్వాగతిస్తూనే కొన్ని సవరణలు ప్రతిపాదిస్తున్నాం’అని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చ అనంతరం సామాజిక న్యాయ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ సమాధానంలో జితేందర్‌ రెడ్డి లేవనెత్తిన అంశాలను ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో ఆయన లేచి మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంతలోనే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆ వెంటనేVఆ బిల్లుపై ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement