గోడ మీద పిల్లిలా బాబు : టీఆర్‌ఎస్ నేతలు | TRS leaders criticise Chandrababu naidu | Sakshi
Sakshi News home page

గోడ మీద పిల్లిలా బాబు : టీఆర్‌ఎస్ నేతలు

Aug 30 2013 1:56 AM | Updated on Aug 15 2018 7:59 PM

గోడ మీద పిల్లిలా బాబు : టీఆర్‌ఎస్ నేతలు - Sakshi

గోడ మీద పిల్లిలా బాబు : టీఆర్‌ఎస్ నేతలు

‘‘తెలంగాణవైపా.. సీమాంధ్రవైపా? ఎవరిపక్షమో ఇప్పటికైనాస్పష్టంగా చెప్పకుండా డ్రామాలాడితే ప్రజలు నమ్మరు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబును టీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు.

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘తెలంగాణవైపా.. సీమాంధ్రవైపా? ఎవరిపక్షమో ఇప్పటికైనాస్పష్టంగా చెప్పకుండా డ్రామాలాడితే ప్రజలు నమ్మరు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబును టీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. అటో, ఇటో చెప్పకుండా బాబు గోడమీద పిల్లిలా, రెండు కళ్ల సిద్ధాంతాన్నే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలోని ఎంపీ మందా జగన్నాథం నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ మాట్లాడారు.
 
  సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం, ఆత్మహత్యలపై బాధపడుతున్న చంద్రబాబు, తెలంగాణ ఆత్మబలిదానాలపై ఏనాడైనా సంతాపం తెలిపారా అని కడియం ప్రశ్నించారు. దీనితోనే బాబు తెలంగాణ వ్యతిరేక బుద్ధి బయటపడిందన్నారు. 2009లో తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత అడ్డుకున్నదీ, ఇప్పుడు ‘యూ’ టర్న్ తీసుకున్నదీ బాబే అని కడియం విమర్శించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే, లేకుంటే వారం రోజుల పాటు సమావేశాలను పొడిగించైనా తెలంగాణ బిల్లు పెట్టి ప్రస్తుత ఉద్యమానికి చెక్ పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
 
 ఇప్పుడు వ్యతిరేకించడం అన్యాయం
 టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తే, కాంగ్రెస్ ఎంపీలు వెళ్లి పరామర్శించారని దుయ్యబట్టారు. ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే అభ్యంతరంలేదని అఖిలపక్షంలో చెప్పిన పార్టీలు ఇప్పుడు వ్యతిరేకించడం అన్యాయమన్నారు. విభజన నిర్ణయం జరిగాక సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం అసలు సమస్యలేమిటో చెప్పడంలో ఘోరంగా విఫలమైందని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుని నెలరోజులు గడవడం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ రాకను పురస్కరించుకుని వచ్చే నెల 6న కరీంనగర్‌లో  రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టినట్టు చెప్పారు.
 
 మందా నివాసంలో టీఆర్‌ఎస్ నేతల భేటీ..
 ఎంపీ మందా జగన్నాథం నివాసంలో మధ్యాహ్నం టీఆర్‌ఎస్ నేతలు భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, నేతలు జగదీశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, హరీశ్‌రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, స్వామిగౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, జితేందర్‌రెడ్డి, వినోద్ తదితర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. కరీంనగర్‌లో వచ్చే నెల 6న తలపెట్టిన బహిరంగ సభపై చర్చించడానికే సమావేశమయ్యామని ఓ నేత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement