ఆరోగ్యశాఖ మంత్రికి ఉద్వాసన..!

Tripura Health Minister Dropped From Cabinet Over Anti Party Activities - Sakshi

పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణలు

త్రిపుర ప్రభుత్వం నిర్ణయం

అగర్తలా : త్రిపుర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత సుదీప్‌రాయ్‌ బర్మన్‌ మత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. లోక్‌సభ తాజా ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో బర్మన్‌కు పదవీ గండం తప్పలేదు. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్టు శుక్రవారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ​ చేసింది. బర్మన్‌ ఉద్వాసనతో ఆయన మంత్రిగా ఉన్న ఆరోగ్య శాఖ, ఐటీ, ప్రజాపనుల శాఖల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేవ్‌ చేపట్టనుండగా.. కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉపముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ చేపట్టనున్నారు.  

త్రిపుర మాజీ సీఎం సమీర్‌ రంజన్‌ కుమారుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బర్మన్‌ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. రెండేళ్ల క్రితం ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సహా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ-ఐపీఎఫ్‌టీ కూటమి బలోపేతం కావడానికి కృషి చేశారు. ఆయన 1998 నుంచి నేటి వరకు అగర్తలా శాసనసభా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న సీపీఎంను గద్దెదించి బీజేపీ అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రంలో ఒకటి సీపీఎం గెలుచుకోగా.. మరో స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింస రాజుకుంది. ఇప్పటి వరకు ముగ్గురు మరణించగా కొన్ని వందల మంది గాయపడ్డారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top