జపాన్‌ ప్రజలకు ఆ ‘గుణం’ ఏలా!? | Traveling Help You Become Better Person | Sakshi
Sakshi News home page

జపాన్‌ ప్రజలకు ఆ ‘గుణం’ ఏలా!?

May 14 2019 3:48 PM | Updated on May 14 2019 3:48 PM

Traveling Help You Become Better Person - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఇలాంటి మనస్తత్వం అబ్బడానికి కారణం ఏమిటన్న అంశంపై పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.

సాక్షి, న్యూఢిల్లీ : ఇంటా బయట మనం సెల్‌ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. రైళ్లలో, బస్సుల్లో, కార్లలో పోతున్నప్పుడు కూడా వాటిని వాడుతుంటాం. మరికొందరు వాష్‌ రూముల్లోకి వెళ్లినా సెల్‌ఫోన్లను వెంట తీసుకెళతారు. ఇందుకు జపాన్‌ ప్రజలు పూర్తి విరుద్ధం. వారు సెల్‌ఫోన్లను వెంట తీసుకెళతారుగానీ, రైళ్లలో, బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు సెల్‌ఫోన్లలో మాట్లాడరు. ఎక్కువగా ఆఫ్‌ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే వారు సెల్‌ఫోన్లలో మాట్లాడుతుంటే ఇతరులకు, అంటే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే అలా చేస్తారట. అంతేకాకుండా వారు తడిచిన గొడుగులు పట్టుకొని బస్సుల్లోకిగానీ, రైళ్లలోకిగానీ ఎక్కరు. వాటి కోసం స్టేషన్లో ఏర్పాటుచేసిన ‘ఓపెన్‌ బాస్కెట్‌’లో పడేసి వెళతారు. తిరుగు ప్రయాణంలో తీసుకుంటారు (వాటిని ఎవరు కూడా ఎత్తుకు పోరాట). దీనికి కారణం ఆ తడసిన గొడుగువల్ల రద్దీగా ఉండే రైళ్లలో తోటి ప్రయాణికుల బట్టలు తడుస్తాయన్న ఉద్దేశమట.

ఇలాంటి మనస్తత్వం అబ్బడానికి కారణం ఏమిటన్న అంశంపై పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. మనిషి బ్రెయిన్‌లో ఉండే ‘మిర్రర్‌ న్యూరాన్స్‌’ స్పందన వల్ల ఇలాంటి ప్రవర్తన అబ్బుతుందని లాస్‌ ఏంజెలెస్‌లోని ‘డేవిడ్‌ జెవిన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’కు చెందిన ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్‌ అండ్‌ సోషల్‌ బిహేవియర్, బ్రెయిన్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌’ పరిశోధకులు తేల్చి చెప్పారు. వాస్తవానికి మనిషి బ్రెయిన్‌లో మిర్రర్‌ న్యూరాన్స్‌ అంటూ ప్రత్యేకమైనవి ఏమీ ఉండవని, ‘మిర్రరింగ్‌ బిహేవియర్‌’ అంటే మన వల్ల ఇతరులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అన్న కోణంలో మనం ఆలోచించినప్పుడు, తోటి ప్రయాణికులను చూస్తూ ఆ ఇబ్బందులు ఏమిటో మనం గుర్తించినప్పుడు మెదడులోని కొన్ని న్యూరాన్లలో స్పందన కలుగుతుందని,తద్వారా అలా ప్రవర్తించరాదనే ఆలోచన వస్తోందని పరిశోధకులు తెలిపారు.

ఇలాంటి ప్రవర్తన ప్రపంచంలోకెల్లా జపాన్‌ ప్రజల్లోనే ఎక్కువుగా ఉందట. సహజంగానే వారు సమాజంలో కలిసికట్టుగా జీవించాలనే ‘కమ్యూనిటీ ఫీలింగ్‌’ వారిలో ఉండడం ఒకటైతే, వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు, వారి భిన్న సంస్కృతులను తెలుసుకోవడం ద్వారా, వారితో మమేకమవడం ద్వారా వారిలో ఆ గుణం అంటే ‘తోటివారికి ఇబ్బంది కల్గించరాదు’ అనే ఆలోచన పెరుగుతోందట. జపనీయులను చాలా గౌరవంగా చూసుకుంటారనే విషయం తెల్సిందే. ముఖ్యంగా భిన్న జాతులు, భిన్న భాషల వారు నివసించే పరాయి ప్రాంతం, అంటే విదేశాల్లో పర్యటించడం వల్ల అలాంటి గుణం ద్విగుణీకృతం అవుతుందట.

జపనీయుల్లో ‘మనం’ అనే మంచి గుణం
అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో ప్రజల్లో ‘సెల్ఫ్‌’ ఎక్కువట. అంటే ‘నేను పైకి రావాలి, నేను ఎదగాలి. ఎవ్వరి మీద ఆధారపడరాదు’ అన్న ఆలోచనే ‘నేను’కు దారితీస్తుందట. జపాన్‌ ప్రజల్లో మాత్రం ‘మనం’ అనే గుణం ఉందట. ‘మనం అభివృద్ధి చెందాలి. మనం పైకి రావాలి. అందుకు పరస్పరం సహకారం అవసరం’ అని వారు భావిస్తారట. తోటి వారిని ఇబ్బంది పెట్టని ప్రవర్తన లేదా సంస్కృతి మనలో కూడా పెరగాలంటే దేశ, విదేశాలు తిరుగుతూ భిన్న సంస్కృతుల ప్రజలను కలుసుకుంటూ వారితో కలిసి మమేకం కావాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు. రోజువారి డ్యూటీలకు స్వస్తి చెప్పి సుందర పర్యాటక ప్రాంతాలకు, అందమైన జలపాతాలను ఆస్వాదించేందుకు వెళితే మనసు ఉల్లాసంగా ఉంటుందనే విషయం అనుభవ పూర్వకంగా మనందరికి తెల్సిందే. ప్రవర్తనలో మార్పు రావాలంటే మాత్రం ఇతర పర్యాటకులతో కలిసిపోవడం లేదా అక్కడి స్థానికులతో కలిసి పోవడం అవసరం అట. విమానాల్లో తిరుగుతూ లగ్జరీ హోటళ్లలో గడపడం కంటే రైళ్లలోనో, సొంత వాహనాల్లోనో తిరుగుతూ స్థానిక ప్రజలను కలుసుకునే చోట బస చేయాలట. ముఖ్యంగా మానవ హక్కులను గౌరవించే దేశాల్లో ముందుగా పర్యటించడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement