ఇక రైలు చార్జీల మోత..

Train Fare Hike Likely This Week - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైలు చార్జీలను భారీగా పెంచేందుకు భారతీయ రైల్వేలు రంగం సిద్ధం చేస్తున్నాయి. అన్ని రైళ్లు, తరగతుల వారీగా ప్రయాణీకుల చార్జీలను ఈ వారంలోనే పెంచేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. కిలోమీటర్‌కు 5 నుంచి 40 పైసల వరకూ పెంపు ఉంటుందని ప్రముఖ హిందీ పత్రిక కథనం వెల్లడించింది. రైలు చార్జీల పెంపు ప్రతిపాదనకు నవంబర్‌లోనే ప్రధాని కార్యాలయం ఆమోదముద్ర వేసినా జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటనలో జాప్యం నెలకొంది. ఆర్థిక మందగమనం ప్రభావంతో రైల్వేల ఆర్థిక వనరులపై ఒత్తిడి అధికమైంది.

ఇక రోడ్డు రవాణా నుంచి దీటైన పోటీ ఎదురవడంతో సరుకు రవాణా చార్జీలను పెంచే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణీకుల విభాగం నుంచి వచ్చే రాబడిపైనే రైల్వేలు కన్నేశాయి. గత రెండేళ్లుగా ప్రయాణీకుల చార్జీలను నేరుగా పెంచకపోవడంతో తాజాగా చార్జీల పెంపునకే మొగ్గుచూపారు. గతంలో కొన్ని రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్‌ వ్యవస్ధతో పాటు రిఫండ్‌ వ్యవస్థలో మార్పులు వంటి చర్యలతో రాబడి పెంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రైల్వేల మొత్తం రాబడి గణనయంగా తగ్గి రూ 13,169 కోట్లకు పరిమితమైంది. అక్టోబర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా మొత్తం వ్యయం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. వ్యయ నియంత్రణతో పాటు రాబడి పెంపునకు చార్జీల వడ్డన ద్వారా సమతూకం సాధించాలని రైల్వేలు యోచిస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top