భావి ప్రధాని రాహుల్‌: తృణమూల్‌ అభ్యంతరం | TMC Fumes At MK Stalins Rahul For PM Pitch | Sakshi
Sakshi News home page

భావి ప్రధాని రాహుల్‌: తృణమూల్‌ అభ్యంతరం

Published Mon, Dec 17 2018 10:23 AM | Last Updated on Mon, Dec 17 2018 10:32 AM

TMC Fumes At MK Stalins Rahul For PM Pitch - Sakshi

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ(ఫైల్‌ఫోటో)

స్టాలిన్‌ ప్రకటనపై భగ్గుమన్న విపక్షం..

సాక్షి, న్యూఢిల్లీ : భావి ప్రధానిగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రతిపాదించడం పట్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని అభ్యర్ధి పేరును వెల్లడించడం విపక్ష పార్టీల ఐక్యతను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. స్టాలిన్‌ ప్రతిపాదనను తాము తీవ్రంగా తీసుకున్నామని, ప్రధాని పదవికి ఏ ఒక్కరి పేరు వెల్లడించడం స్వాగతించదగినది కాదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే ప్రధాని ఎవరనేది నిర్ణయించాలని తాము గతంలోనే స్పష్టం చేశామని తృణమూల్‌ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఎవరి పేర్లనూ ప్రస్తావించని క్రమంలో ఇతర పార్టీలు ఎందుకు ఆ పనికి పూనుకుంటున్నాయని ప్రశ్నించింది.  కరుణానిధి విగ్రహావిష్కరణ సందర్భంగా శనివారం చెన్నైలో భావి ప్రధాని రాహుల్‌ పేరును డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ విజయాల నేపథ్యంలో ప్రధాని రేసులో రాహుల్‌ పేరును స్టాలిన్‌ ప్రకటించడం గమనార్హం.

ఈ దేశాన్ని కాపాడేందుకు మోదీని ఓడించే సత్తా కలిగిన రాహుల్‌ గాంధీని తాను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తున్నానని స్టాలిన్‌ పేర్కొన్నారు. సమాజ్‌వాది పార్టీ సైతం రాహుల్‌ అభ్యర్ధిత్వాన్ని ముందుకు తేవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ ప్రధాని ఎవరనేది ప్రజల తీర్పు ద్వారానే వెల్లడవుతుందని ఆ పార్టీ నేత ఘన్‌శ్యామ్‌ తివారీ చెప్పుకొచ్చారు. తృణమూల్‌తో పాటు ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీలు సైతం స్టాలిన్‌ ప్రకటనతో విభేదించాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆయా పార్టీలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement