షాపులో చొరబడ్డ బెంగాల్ టైగర్...హాయిగా..

గువాహటి : అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద బీభత్సానికి మనుషులే కాదు పశుపక్ష్యాదులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో కజిరంగా జాతీయ పార్కులోని ఓ రాయల్ బెంగాల్ టైగర్ రోడ్డుపైకి వచ్చి పరుగులు తీసింది. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న మోతీలాల్ అనే వ్యక్తి షాపులో చొరబడి దర్జాగా పరుపుపై నిద్రపోయింది. ఈ క్రమంలో అతడు అటవీ అధికారులను ఆశ్రయించగా ప్రస్తుతం వారు పులిని తిరిగి పార్కులోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ఘటన కజిరంగాలో చోటుచేసుకుంది.
తనకు ఎదురైన భయానక అనుభవం గురించి షాపు మోతీలాల్ మాట్లాడుతూ...‘ గురువారం పొద్దున నేను షాపులో కూర్చుని ఉన్నాను. పులి వస్తోందంటూ అరుపులు, కేకలు వినిపించాయి. బయటికొచ్చే చూసే సరికి దాదాపు 20 అడుగుల దూరంలో నా ముందు పులి నిల్చొని ఉంది. ఒక్కసారిగా భయం వేసింది. కానీ అది నన్నేమీ అనకుండా నేరుగా షాపులోకి వెళ్లి అక్కడున్న పరుపుపై నిద్రపోయింది. పాపం అది బాగా అలసిపోయినట్టుంది. మనిషి ప్రాణానికి ఎంత విలువ ఉంటుందో పులి ప్రాణం కూడా అంతే గొప్పది. అందుకే షాపు మొత్తం దానికే వదిలేశాను. అటవీ అధికారులు దానిని బయటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ఇక ఎవరికీ హాని చేయకుండా పులిని అక్కడి నుంచి సురక్షితంగా తరలించనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి