ఎంపీ గవర్నర్ కుమారుడి అనుమానాస్పద మృతి | The mysterious death of the son of maharastra Governor | Sakshi
Sakshi News home page

ఎంపీ గవర్నర్ కుమారుడి అనుమానాస్పద మృతి

Mar 26 2015 1:03 AM | Updated on Oct 8 2018 5:45 PM

ఎంపీ గవర్నర్ కుమారుడి అనుమానాస్పద మృతి - Sakshi

ఎంపీ గవర్నర్ కుమారుడి అనుమానాస్పద మృతి

మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్(50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్(50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు(వ్యాపమ్) స్కాంలో శైలేష్ యాదవ్ నిందితుడు. ఆయన మృతికి కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ స్కాంలో నిందితుడుగా పేరు చేర్చినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని.. ఆయన మృతికి అదొక కారణం కావచ్చని ప్రాథమికంగా మాత్రమే భావిస్తున్నామని ఆయన కుటుంబ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు సత్యదేవ్ త్రిపాఠీ అభిప్రాయపడ్డారు. గుండెపోటు వల్ల కానీ, మెదడులో రక్తస్రావం వల్ల కానీ మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. శైలేష్ యాదవ్ మృతదేహం ఆయన బెడ్‌రూమ్‌లో నేలపై పడి ఉందని స్థానిక గౌతమ్ పల్లి పోలీసులు తెలిపారు. ఆయనకు మధుమేహం కూడా ఉందని.. అది పెరగటం వల్ల కూడా మరణం సంభవించి ఉండవచ్చని పోలీసులన్నారు.

అయితే పోస్ట్‌మార్టమ్ శైలేష్ మృతికి స్పష్టమైన కారణాలు వెల్లడి కాలేదని పోలీసులు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో గ్రేడ్ 3 టీచర్ల నియామకానికి సంబంధించిన స్కాంలో శైలేష్ యాదవ్ పేరును నిందితుడిగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చేర్చింది. ఆయనతో పాటు తండ్రి, మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్‌యాదవ్ పేరునూ నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో 10మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.3లక్షల చొప్పున శైలేష్ స్నేహితుడు విజయ్‌పాల్ వసూలు చేసి భోపాల్ రాజ్‌భవన్‌లో నేరుగా శైలేష్‌కు అందించారని అభియోగాలను టాస్క్‌ఫోర్స్ నమోదు చేసింది. మధ్యప్రదేశ్‌లో ఇటీవలి దశాబ్దాలలో అతి పెద్ద అవినీతి కుంభకోణంగా వ్యాపమ్ సంచలనం సృష్టించింది. ఈ కేసులో తమను నిందితులుగా చేర్చటంపై రాంనరేశ్‌యాదవ్ హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా శైలేష్ యాదవ్ మృతి వ్యవహారాన్ని సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement