
చింతలమానెపల్లి(సిర్పూర్): కశ్మీర్‌లో సరిహద్దు వెంట సోమవారం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన రాజేశ్ దక్వా(40) అనే హవల్దార్ వీరమరణం పొందారు. తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రవీంద్రనగర్ గ్రామం రాజేశ్ స్వస్థలం. శ్రీనగర్ పరిధిలోని డోండా జిల్లా ఆర్‌ఆర్ రెజిమెంట్4లో విధులు నిర్వర్తిస్తుండగా సోమవారం ఈ ఘటన జరిగింది. రాజేశ్ 1997లో సైన్యంలో సైనికుడిగా చేరారు. తదనంతరం హవల్దార్‌గా పదోన్నతి పొందారు. ఆయనకు భార్య జయ, కుమార్తెలు రోహిణి, ఖుషి ఉన్నారు.
తండ్రి మణిహోహన్ గతంలో మరణించారు. రాజేశ్ తల్లి లతిక సొంతూరులోనే చిన్న హోటల్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. రాజేశ్ పార్థివదేహాన్ని శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి అక్కడ అధికార లాంఛనాలు పూర్తిచేసి సొంతూరుకు తరలించనున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల కారణంగా మృతదేహం స్వస్థలానికి తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మృతదేహాన్ని బుధవారం రాత్రి లేదా గురువారం రవీంద్రనగర్‌కు తరలించే అవకాశం ఉంది. సంఘటన నేపథ్యంలో చింతలమానెపల్లి మండలం, జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి.