
ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పోస్ట్
ఫేస్‌బుక్‌లో పెద్దవాడికి ‘హాయ్ శిష్యా’ అంటూ పోస్ట్ చేయడం 20 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది.
సీనియర్‌ను ‘శిష్యా’ అని పిలిచాడని హత్య
సాక్షి, బెంగళూరు: ఫేస్‌బుక్‌లో పెద్దవాడికి ‘హాయ్ శిష్యా’ అంటూ పోస్ట్ చేయడం 20 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. ఈ దురాగతానికి పాల్పడిన ఏడుగురిలో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. బెంగళూరులో ఉంటున్న అరుణ్‌కుమార్ (20) కెంపేగౌడ విమానాశ్రయంలోని కార్గో విభాగంలో పనిచేస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌తో ఛాట్ చేసేవాడు. పదిహేను రోజుల క్రితం కళాశాలలో తనకంటే సీనియర్ అయిన బెంగళూరుకు చెందిన సందీప్‌కు ఫేస్‌బుక్‌లో ‘హాయ్ శిష్యా’ అని పోస్ట్ చేశాడు. దీంతో సందీప్ ఆగ్రహించాడు.
సోమవారం రాత్రి సందీప్ స్నేహితులు అరుణ్ ఇంటికెళ్లారు. అరుణ్‌ను కారులో ఎక్కించుకుని బాగళూరు క్రాస్ వద్దకు చేరుకోగానే అరుణ్‌ను చాకుతో పొడిచి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలైనఅరుణ్‌ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరుణ్ మృతిచెందాడు. అరుణ్‌మృతికి కారకులుగా భావిస్తున్న వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగిలిన వారి కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.